ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం

Published Wed, May 8 2024 12:40 AM

-

● నకిలీ నియామకపత్రాలతో వంచన ● నిరుద్యోగులకు ఓ మహిళ టోకరా

నిర్మల్‌టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానన్న ఓ మహిళ చేతిలో పలువురు యువకులు మోసపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ పలువురు నిరుద్యోగులను ఏజెన్సీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించింది. ముందుగా కొంత నగదు ఇవ్వాలని కోరింది. దీంతో ఆమెను కలిసిన కొందరు నిరుద్యోగులు రూ.2లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పారు. పట్టణానికి చెందిన ఓ యువకుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టు కోసం రూ.3 లక్షలు ఇచ్చాడు. వీరికి సదరు మహిళ నియామక పత్రాలు కూడా ఇచ్చింది. సంబంధిత ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లిన ముగ్గురు బాధితులకు అవి నకిలీ పత్రాలుగా తెలిసింది. విషయం తెలుసుకున్న ఓ నిరుద్యోగి సదరు మహిళను నిలదీయగా మోసం బయటపడింది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి వద్ద రూ.8 లక్షల నగదు తీసుకుని నకిలీ ఆర్డర్‌ కాపీలు చేతిలో పెట్టింది. ఉద్యోగం కోసం ఆరు నెలలు తిరిగిన బాధితులు తమ డబ్బులివ్వాలని వారు అడిగితే పోర్జరీ చెక్కులు, బాండ్లు రాసిచ్చి తప్పించుకుంది. నిలదీస్తే తమ పైనే కేసు పెడతానని బెదిరిస్తోందని బాధితులు వాపోయారు. నిర్మల్‌ పట్టణంలోనే పదుల సంఖ్యలో సదరు మహిళ బాధితులున్నారు. వీరికి రూ.కోటికి పైగా టోకరా వేసినట్లు సమాచారం. ఇంకా ఎంతమంది బాధితులున్నారో కొద్దిరోజుల్లో తెలవనుంది. ఉద్యోగాల పేరిట మోసగించిన మహిళపై బాధితులు బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

 
Advertisement
 
Advertisement