యాప్‌ సరే.. అవగాహనేది? | Sakshi
Sakshi News home page

యాప్‌ సరే.. అవగాహనేది?

Published Wed, May 22 2024 11:45 PM

యాప్‌

● ఓపీ నమోదుకు కొత్త యాప్‌ ● ఆస్పత్రిలో క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు ● అవగాహన లేక రోగుల ఇబ్బందులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఓపీ(ఔట్‌ పేషెంట్లు) నమోదుకు అమలు చేస్తున్న యాప్‌పై అవగాహన లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు వరుసలో ఎక్కువ సేపు నిలబడి ఉండకుండా ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఓపీ కోసం వచ్చే రోగులు ‘అబా’ యాప్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకుని టోకెన్‌ పొందేలా వారం రోజులుగా అమలు చేస్తోంది. బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, క్యూఆర్‌ కోడ్‌, యాప్‌ ఇన్‌స్టాల్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తమైంది. రోగుల్లో పేదవారే ఉండడం, సాంకేతికతపై సరైన అవగాహన లేకపోవడం, క్యూఆర్‌ కోడ్‌ వినియోగం తెలియకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అవగాహన కల్పించేందుకు ఇద్దరు ఉద్యోగులను ఏర్పాటు చేసినా వచ్చిన రోగులందరికీ అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో ఓపీ వద్ద రోగుల తోపులాట పెరగడం, తమకు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలంటూ ఒకేసారి అందరూ కోరడంతో బుధవారం గందరగోళం ఏర్పడింది. ప్రతీ రోజు 400కు పైగా రోగులు వస్తుండడంతో మరింత మందిని నియమించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇబ్బందులు తీర్చేందుకే..

ప్రస్తుతం ఆస్పత్రికి ప్రతీ రోజు 400కు పైగా ఔట్‌పేషెంట్లు వస్తుండగా, మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)కు 200కు పైగా వస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు పెరిగి ఆ సంఖ్య 900పైగా ఉంటుంది. రోగులకు టోకెన్లు ఇచ్చి వైద్య పరీక్షలకు పంపిస్తుండగా గంటల తరబడి వరుసలో ఉండాల్సి వస్తోంది. దీంతో రోగుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేసి టోకెన్‌ ఇచ్చేందుకు సమయం వృథా అవుతుండడం, రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రోగి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఓపీ నమోదు కాగితం ఇచ్చేందుకు సమయం ఎక్కువగా పడుతుండడాన్ని అరికట్టేందుకు ఓపీ టోకెన్‌ ఇచ్చేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెచ్చారు.

డౌన్‌లోడ్‌ ఇలా

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్నవారు ప్లేస్టోర్‌ నుంచి ఏబీహెచ్‌ఏ(ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆస్పత్రిలో ఓపీ నమోదుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఫోన్‌నంబరు లేదా ఆధార్‌నంబరు నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి. మొబైల్‌ నంబరుకు వచ్చిన టోకెన్‌ నంబరును ఆస్పత్రి కౌంటర్‌లో చూపిస్తే ఓపీ చీటి డౌన్‌లోడ్‌ చేసి ఇస్తారు.

అవగాహన కల్పిస్తున్నాం

ఆస్పత్రిలో యాప్‌తో పాటు క్యూఆర్‌ కోడ్‌ను రోగుల ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసి వివరించేందుకు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఎంసీహెచ్‌లోనూ క్యూఆర్‌ కోడ్‌ అమలులోకి తీసుకొచ్చాం. రోగులు స్వయంగా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఓపీ టోకెన్‌ ఎలా పొందాలనే దానిపై అవగాహన కల్పించేలా చూస్తున్నాం. ప్రజలందరికీ అవగాహన వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఆ తరువాత క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండానే క్యూఆర్‌ కోడ్‌, యాప్‌ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్‌ను సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తోపాటు వారి ఆధార్‌కార్డుకు లింక్‌ చేసి ఉన్న మొబైల్‌ ఉంటేనే ఇది పనిచేస్తుంది.

– డాక్టర్‌ హరీశ్‌చంద్రారెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

యాప్‌ సరే.. అవగాహనేది?
1/2

యాప్‌ సరే.. అవగాహనేది?

యాప్‌ సరే.. అవగాహనేది?
2/2

యాప్‌ సరే.. అవగాహనేది?

Advertisement
 
Advertisement
 
Advertisement