శ్రీరాంపూర్: సింగరేణిలో యంత్రాల పని గంటల పెంపుపై యాజమాన్యం దృష్టి సారించింది. మెరుగైన ఉత్పత్తి, ఉత్పాదకత కోసం చర్యలు చేపడుతోంది. కంపెనీలోని 22భూగర్భ గనులు, 18ఓసీపీల్లో యంత్రాల ద్వారా బొగ్గు తీస్తున్నారు. వాటి పని తీరును వంద శాతానికి పెంచితే మరింత అభివృద్ధి సాధిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ఇప్పటికే గనులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగులను చైతన్యపర్చిన యాజమాన్యం ఇప్పుడు అమలు దిశగా అడుగులు వేస్తోంది. భూగర్భ గను(యూజీ)ల్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాల ద్వారా జరుగుతోంది. కొన్నింటిలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు, లాంగ్‌వాల్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. తట్టాచెమ్మాస్‌కు ఏనాడో స్వస్తి చెప్పడంతో గనులన్నీ పాక్షిక, పూర్తి స్థాయి యాంత్రీకరణ గనులుగా మారాయి. కానీ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడంతో సా మర్థ్యం మేరకు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికమవుతోంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10,394 వ్య యం అవుతుండగా విక్రయిస్తే రూ.4,854 వస్తుంది. ఈ లెక్కన టన్ను బొగ్గుకు రూ.5,540 నష్టం వస్తోంది. ప్రస్తుతం ఓసీపీల్లో వచ్చే లాభాలతో భూగర్భ గనుల్లో వచ్చే నష్టాలను పూడుస్తున్నారు. భూగర్భ గనుల్లో లాభాలు సాధించడం సాధ్యం కాదు కాబట్టి నష్టాలైనా తగ్గించుకోవాలని యాజమాన్యం పేర్కొంటోంది. ఇందుకోసం భూగర్భ గనుల్లో యంత్రాల పని గంటల పెంపుపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం యంత్రాలు వాటికి నిర్దేశించిన పని గంటల్లో సగం కూడా దాటడం లేదు. దీంతో కోల్ కటింగ్ పనులు కూడా మెరుగవ్వాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కోల్‌కట్టర్లు ప్రస్తుతం 40ఉళ్లు(హోల్స్) కోసం మూడు బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. దీన్ని 50 ఉళ్లు కోసం నాలుగు బ్లాస్ట్ చేస్తే ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని అంటున్నారు.
గైర్హాజరు, ఖాళీల సమస్య
భూగర్భ గనుల్లో కంపెనీ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే అందుకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. సరిపడా కార్మికులు ఉండాలి. భూగర్భ గనుల్లో 30శాతం మంది విధులకు ఎగనామం పెడుతున్నారు. ఖాళీలు సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ గనుల్లో 50 ఉళ్లు కోసి నాలు గు బ్లాస్టింగ్‌లు చేయాలంటే ముందుగా అక్కడ రక్షణ పనులు చేయించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. ఒక ఎస్‌డీఎల్ యంత్రానికి రెండు పని ప్రదేశాలను కేటాయిస్తే కోల్‌కట్టర్‌లు పూర్తి స్థాయిలో నిర్దేశించిన ఉళ్లు చేస్తారని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment