ఇక ఈ–వాహనాల జోరు
నూతన వాహనం తీసుకోవాలనుకుంటే మీకు నచ్చిన కంపనీదే కొనుగోలు చేయండి.. అది మీ ఇష్టం.. కానీ విద్యుత్‌తో నడిచే వాటికి మీ తొలి ప్రాధాన్యత ఇవ్వండి.. భవిష్యత్ తరాలకు, పర్యావరణ వారసత్వ సంపదను సురక్షితంగా అందించే ప్రయత్నం చేద్దాం.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు
నిర్మల్‌ఖిల్లా: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల సమస్యను అధిగమించడం సగటు మానవులకు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో పర్యావరణహితాన్ని, ఖర్చును తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండడం ప్రస్తుత మార్కెట్లో కనిపిస్తోంది. విద్యుత్ వాహనాలపై రోడ్డుట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలను పూర్తిస్థాయిలో మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ‘న్యూ ఈవీ పాలసీ’ ఉత్తర్వుల జీవో 41 జారీచేసింది.
మారుతున్న ట్రెండ్...
గతంలో ఇంటింటికీ ఓ సైకిల్ ఉండేది. ప్రస్తుతం కా లం ఉరుకుల పరుగులమయంగా మారింది. ఏ కొద్ది దూరం వెళ్లాలన్నా బైక్ తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలోనే వాహనదారులంతా తమ పాత వాహనాల స్థానంలో విద్యుత్‌తో నడిచే స్కూ టీలు, బైక్‌లు, ఇతర వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగ, ఉపాధి, వాణిజ్య అవసరాలు కలి గిన వ్యక్తులంతా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ వాహనాల సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు పెరుగుతున్న వాహన కాలుష్యం రీత్యా ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన ప్రోత్సాహంతో కూడిన మినహాయింపులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటికోసం తగినన్ని చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా అవసరమని వాహనదారులు పేర్కొంటున్నారు. రూ.60 వేల నుండి 2 లక్షల వరకు కూడా ధరల్లో లభ్యమవుతున్నాయి.
రిజిస్ట్రేషన్ ఉచితం
ఎలక్ట్రిక్ వాహనాలలో 250 వాట్ల కంటే తక్కువ శక్తిని కలిగి ఉండి గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం కలిగిన సామర్థ్యం ఉన్న వాహనాలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉండేది. తాజాగా విద్యుత్‌తో నడిచే అన్ని వాహనాలకు కూడా పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డుట్యాక్స్ రద్దు చేయడంతో వీటి కొనుగోలు మరింత పెరిగే అవకాశం ఉందని వాహన అమ్మకందారుల డీలర్లు, రవాణాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ వాహనాలకు పలు మినహాయింపులు
రోడ్డు ట్యాక్సు, రిజిస్ట్రేషన్ చార్జీలు వంద శాతం రాయితీ
ఈవీ నూతన పాలసీ జీవో 41 విడుదలతో వాహనదారుల హర్షం
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ తోడ్పాటు
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఇతని పేరు జుట్టు చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాడు. వృత్తి కార్యకలాపాల్లో భాగంగా రోజంతా వివిధ ప్రాంతాలు తిరగాల్సి వస్తోంది. ఇతనికి గతంలో పెట్రోల్ తో నడిచే బైక్ ఉండేది. కొన్నినెలల క్రితం దానిని అమ్మేసి ఎలక్ట్రిక్ చార్జింగ్ స్కూటీ తీసుకున్నాడు. పెట్రోల్ ఖర్చు తప్పిందని, కుటుంబ సభ్యులంతా సులభంగా నడుపుతున్నారని చెబుతున్నాడు. నెలకు దాదాపు రూ.3వేలకు పైగా అయ్యే ఖర్చు తప్పిందని చెబుతున్నాడు. అంతేకాకుండా సాధారణ వాహనాలతో పోల్చితే కాలుష్య రహితంగా కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నాడు.
పెట్రోల్ ఖర్చు తప్పింది
గతంలో పెట్రోల్ బైక్ ఉండేది. రోజుకు సగటున రూ.200 పెట్రోల్ కోసం వెచ్చించాల్సి వచ్చేది. దాన్ని అమ్మేసి కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశా. రెండు మూడు రోజులకోసారి చార్జింగ్ పెడుతున్నా. పెట్రోల్ ఖర్చు తప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావడం
సంతోషాన్నిస్తోంది. – వోస శ్రీనివాస్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment