ఖాకీ ముసుగు..! | - | Sakshi
Sakshi News home page

ఖాకీ ముసుగు..!

Published Tue, Jan 28 2025 12:10 AM | Last Updated on Tue, Jan 28 2025 12:10 AM

ఖాకీ

ఖాకీ ముసుగు..!

● పోలీసుల పేరిట దందాలు, సెటిల్‌మెంట్లు ● జిల్లా కేంద్రంలో ఓ నకిలీ పోలీసు అరెస్టు ● జిల్లాలో ముఠా సంచారం..?

మంచిర్యాలక్రైం: జిల్లాలో కొందరు ఖాకీ ముసుగులో సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతున్నారు. పోలీసులమని, ఉన్నతాధికారుల గన్‌మెన్‌ అని, ఆ అధికారి మాకు బాగా దగ్గరని వసూళ్లకు తెర తీస్తున్నారు. రేషన్‌బియ్యం, ఇసుక, మట్టి, స్క్రాప్‌, మద్యం దుకాణాల యజమానులను బెదిరిస్తున్నారు. సమస్యలతో పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పరిచయాలు పెంచుకుని అధికారులతో మాట్లాడుతామంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నెల 16న బెల్లంపల్లికి చెందిన పానుగంటి రాజు మంచిర్యాలలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం సేవించాడు. తుపాకి చూపించి తాను పోలీసునంటూ బెదిరించి బిల్లు చెల్లించకుండా ఉడాయించాడు. ఈ ఘటనలో రాజుతోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఆ తుపాకి డమ్మీదా.. నిజమైనదేనా అనే స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలో కొందరు యువకులు రాత్రివేళ పోలీసులమంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలు తిలక్‌నగర్‌, రాజీవ్‌నగర్‌, కాలేజ్‌రోడ్‌, ఏసీసీ క్వారీ రోడ్‌ ప్రాంతాల్లో ఓ ముఠాగా ఏర్పాడి అక్రమ ఇసుక రవాణా, రేషన్‌ బియ్యం, స్క్రాప్‌ వాహనాలను అడ్డుకోవడం, డబ్బులు వసూలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో అల్లరి మూకల అలజడి ఎక్కువవుతోంది. పలువురు పెద్దల కనుసన్నల్లో ముఠా భూ వివాదాలు, సెటిల్‌మెంట్లు, భౌతికదాడులు, దోపిడీలకు పాల్పడుతోంది. డమ్మీ ఎయిర్‌ గన్స్‌, డమ్మి పిస్తోళ్లు ఉపయోగించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు గానీ వెనుక ఎవరున్నారనేది విషయంలో విచారణ చేయడం లేదు.

● గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా కొందరు స్థానిక సీఐ పేరు చెప్పి నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు తెలిసింది. వసూలు చేసిన వాళ్లు నకిలీలా.. అసలా అనేది అర్థంకాక ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులిపేసుకున్నామని వ్యాపారులు చెప్పడం గమనార్హం.

● లక్సెట్టిపేట మండల కేంద్రంలో ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్‌ చేసేందుకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు సీఐడీ పోలీసులమంటూ బెదిరించారు. పాత నోట్ల వ్యవహారంలో కొత్త నోట్లు మార్పిడి చేస్తున్నారని తెలిసిందంటూ దబాయించారు. పోలీస్‌స్టేషన్‌కు పదా అంటూ రూ.లక్షతో ఉడాయించారు.

● 2020 జనవరి 5న జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన మేకల వ్యాపారి ఖాలుఖాన్‌ శ్రీరాంపూర్‌లోని పలువురు మేకల వ్యాపారుల వద్ద తనకు రావాల్సిన డబ్బు తీసుకెళ్తుండగా.. ఇంత డబ్బు ఎక్కడిది, విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ బెదిరించిన నకిలీ పోలీసులు రూ.9.50లక్షలతో ఉడాయించారు. ఈ ఘటనలో నకిలీ పోలీస్‌ అవతరామెత్తిన మధ్యప్రదేశ్‌లోని మాతేపూర్‌కు చెందిన గబ్బర్‌, వికాస్‌, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌కు చెందిన సుభాష్‌, రామగుండంకు చెందిన పిపాల రమేష్‌, మంచిర్యాల శ్రీరాంపూర్‌కు చెందిన మాటేటి రాజులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు...

పోలీసుల పేరుతో అక్రమాలకు పాల్పడిన నకిలీ పోలీసులపై కఠినమైన చర్యలు తప్పవు. పోలీసులైనా, నకిలీ పోలీసులైనా పోలీస్‌ పదం ఉపయోగించి అక్రమాలకు పాల్పడడం నేరం. అక్రమాలు, సెటిల్‌మెంట్లు, పంచాయితీలు, అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవరైనా పోలీసులమని వసూళ్లకు పాల్పడితే స్థానిక అధికారులకు గానీ 100 డయల్‌కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
ఖాకీ ముసుగు..!1
1/1

ఖాకీ ముసుగు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement