మహిళల భద్రతకు కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: మహిళల భద్రతకు అందరూ కృషి చేయాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు బాలబాలికల, మహిళల వసతిగృహాల అధికారులు, ప్రైవేటు మహిళా వసతిగృహాల యాజమాన్యాలతో మహిళల భద్రతపై సమావేశం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ జిల్లాలో 53 ప్రభుత్వ బాలికల, మహిళల వసతిగృహాలు ఉన్నాయని, మంచిర్యాల పట్టణంలో 16 ప్రైవేటు మహిళా వసతిగృహాలు ఉనాయని తెలిపారు. వీటన్నింటిని షీ టీమ్ సిబ్బంది సర్వే చేశారని తెలిపారు. కొన్నింటిలో సీసీ కెమెరాలు లేవని, సెక్యూరిటీ లేదని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, సిబ్బంది వివరాలు యాజమన్యాల వద్ద ఉండాలని ఆదేశించారు. ఈ సమవేశంలో ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, షీ టీమ్ ఎస్సై హైమా పాల్గొన్నారు.
10వ రోజుకు రిలేనిరాహార దీక్ష
పాతమంచిర్యాల: రావాల్సిన జీతభత్యాలు, కంపెనీ క్లోజింగ్ బెన్‌ఫిట్‌ల కోసం శాలీవాహన పవర్‌ప్లాంటు ఎదుట కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఈ నెల 31న వరంగల్‌లోని జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో కార్మికులు, యాజమాన్యం మధ్య జరిగే సమావేశంలో అన్ని రకాల బెన్‌ఫిట్‌లు చెల్లిస్తామని ఒప్పుకోకపోతే పవర్‌ప్లాంటు స్థలంలో గుడిసెలు వేసుకుంటామని తెలిపారు. పవర్ ప్లాంటు కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్, ఉపాధ్యక్షుడు కాయితి శ్రీనివాస్, కార్మికులు బుచ్చయ్య, తిరుపతి, ఎల్లయ్య, మైదం సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment