న్యాయ సమస్యలు రాకుండా చూడాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
శివ్వంపేట/మనోహరాబాద్ (తూప్రాన్): కొల్చారం(నర్సాపూర్): కుటుంబ వివరాల నమోదులో న్యాయ సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దొంతిలో కుటుంబ సర్వేను ఆర్డీఓ మహిపాల్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్వేలో లోటుపాట్లపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంపై స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల మాదిరిగా కాకుండా నిర్ధిష్టమైన ప్రణాళికతో పూర్తిస్ధాయిలో సర్వే చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. సన్నరకం వడ్ల గింజలను కొలతలు వేసి బోనస్ ఇస్తామనడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే కొల్చారం మండల పరిధిలోని ఏటిగడ్డ మందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్ గ్రామాల్లో రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆమె వెంట డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, సంఘం వైస్ చైర్మన్ మల్లేశం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రంగౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యువత అధ్యక్షుడు సంతోష్‌రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనోహరాబాద్ మండలం పోతారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment