మురికినీటిలో పుణ్యస్నానాలా?
మంజీరాలో నేడు పవిత్ర మాఘ స్నానాలు
● లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ● వసతుల లేమి.. అరకొర ఏర్పాట్లు
పాపన్నపేట(మెదక్): పవిత్ర మాఘ స్నానాలకు మంజీరా ముస్తాబవుతోంది. ఏడుపాయల్లో బుధవారం స్నానాలు చేసి, దుర్గమ్మను దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఈ మేరకు సింగూరు నుంచి 0.3 టీఎంసీ నీటిని విడుదల చేశారు. మాఘస్నానాల కోసం చేస్తున్న ఏర్పాట్లు అరకొరగా సాగుతున్నాయి. మాఘస్నానాల కోసం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన ఈవో చంద్రశేఖర్ మంగళవారం సాయంత్రానికి కూడా ఆలయానికి రాలేదు.
దర్శనం కోసం ప్రత్యేక లైన్లు
పవిత్ర మాఘస్నానాలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. చారిత్రక నేపథ్యమున్న ఏడుపాయల్లో మాఘ స్నానాలు చేస్తే, ఆరోగ్యం, పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయం ముందు భక్తుల సౌకర్యార్థం పెడల్ స్టాండులు. దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీ దర్శనంతోపాటు, ధర్మ దర్శనం ఉంటుంది.
నిర్దేశించిన స్థలాల్లోనే స్నానాలు
ఏడుపాయల్లో మంజీర నది ప్రమాదకరంగా బండ రాళ్లతో నిండి ఉన్నందున, భక్తులకు నిర్దేశించిన ఘా ట్ల వద్దే స్నానాలు చేయాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు, చెక్‌డ్యాం వద్ద, మొదటి బ్రిడ్జి దాటిన తర్వాత, ఘనపురం ఆనకట్ట వద్ద షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
231 పోలీసులతో భారీ బందోబస్తు
జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఏడుపాయల్లో డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 231 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం డాక్టర్ ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇక ఆర్టీసీ మెదక్ డిపో నుంచి 8 ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
ఆకుపచ్చ నీళ్లలోనే స్నానాలు
మంజీర పాయలు గుర్రపు డెక్క..మురికి నీటితో ఆకుపచ్చ రంగులోకి మారాయి. ఏడుపాయల్లోని వివిధ వాణిజ్య సముదాయాలు, ఆవాసప్రాంతాల నుంచి వస్తున్న మురికి నీటి కాలువలు ఏకంగా మంజీరలోకి వదులుతున్నారు. ఎగువన మంజీరా ప్రవాహంలో సైతం పరిశ్రమల నుంచి కలుషిత నీరు కలుస్తుంది. దీంతో మంజీరా నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. అవే నీటిలో భక్తులు పుణ్య స్నానం ఆచరించాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment