కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే అవి మృతి చెందాయని తెలుస్తోంది. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు. పాఠశాలకు వెళ్తూనే డెయిరీ రంగంలోకి వారు కష్టపడుతున్నారు. మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్‌తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది.
గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్‌లలో వీరిది ఒకటి. డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించడం విశేషం. జయరామ్‌కు తెలుగు చిత్ర సీమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించిన విషయం తెలిసిందే.
ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు.
గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య ఎంతో బాధపడ్డామని ఆయన తెలిపారు. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ యువ రైతుల కుటుంబానికి చేరుకున్నారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment