టైటిల్ : ఆదిపురుష్
నటీనటులు: ప్రభాస్, కృతీసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్, దేవదత్త నాగే, తదితరులు
నిర్మాణ సంస్థ: టీ సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్
దర్శకత్వం: ఓం రౌత్
సంగీతం: అజయ్- అతుల్
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళణి
ఎడిటర్: అపూర్వ మోతివాలే, ఆశీష్ మాత్రేలు
విడుదల తేది: జూన్ 16, 2023
యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్.. శ్రీరాముడిగా తొలిసారి ఒక పౌరాణిక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగింది. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో.. అప్పటి నుంచి ఆదిపురుష్‌పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇక తిరుపతిలో నిర్వహించిన ప్రిరిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్. రాములవారి వనవాసం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తండ్రి కోసం రాఘవ్(ప్రభాస్) తన సతీమణి జానకి (కృతి సనన్) తో కలిసి వనవాసం కి వెళ్తారు. వీరితో పాటు శేషు( సన్నీసింగ్)కూడా అడవి బాట పడతారు. ఓ రోజు లంక అధిపతి రావణ్ సోదరి శూర్పణఖ రాఘవ్‌ని చూసి మనసుపడుతుంది. తాను వివాహితుడని చెప్పడంతో జానకిపై దాడి చేస్తుంది శూర్పణఖ. ఈ క్రమంలో శేషు సూర్పణఖ ముక్కు కోస్తాడు. తన చెల్లి మాటలు విని రావణ్ భిక్షువు రూపంలో వచ్చి జానకిని అపహరించుకొని లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకురావడానికి రాఘవ్ పడిన కష్టాలు ఏంటి? అతనికి భజరంగ్(దేవదత్త నాగే), వానర సైన్యం ఎలాంటి సహాయం అందించింది? చివరకు లంకేశ్‌ని ఎలా హతమార్చారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
రాముడి గురించి, రామాయణం గురించి దాదాపు అందరికి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఆదిపురుష్ ప్రత్యేక ఏంటి? అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి విజువల్ వండర్‌లా కథను తీర్చిదిద్దడం. ఈ క్రమంలో రామాయణంలోని ప్రామాణికతను పక్కనపెట్టి కమర్షియల్ కోసం క్రియేటివ్ ఫ్రీడమ్‌ని తీసుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. కథ,కథనం కంటే టెక్నికల్ అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. లంకను ఆవిష్కరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాలు త్రీడీ ఎఫెక్ట్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు.
అమరత్వం కోసం రావణుడు దీక్ష చేయడం.. బ్రహ్మ ప్రత్యేక్షమై వరాలు ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రాఘవ్(ప్రభాస్) ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడైతే జానకిని రావణుడు అపహరించి లంకతో తీసుకెళ్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. జానకీ అపహరణ, జటాయువుతో రావణ్ ఫైట్, వాలీ, సుగ్రీవుల పోరాట ఘట్టాలతో ఫస్టాఫ్ విజువల్ వండర్‌లా సాగుతుంది.
అయితే ఈ కథంతా చాలావరకు తెలిసిందే కావడంతో..పెద్దగా ఆసక్తికలిగించదు. ఇక సెకండాఫ్‌లో రామసేతు నిర్మాణం, భజరంగ్ సంజీవని పర్వతాన్ని ఎత్తడం, ఇంద్రజిత్‌తో పోరాటం, రావణ్, రాఘవ్‌ల మధ్య ఫైట్ సీన్స్ విజువల్స్ పరంగా ఆకట్టుకుంటాయి, కానీ కృత్రిమత్వం ఎక్కువగా ఉండడంతో ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేరు. భావోద్వేగాలు పండకపోవడం, కథనం ఆసక్తికరంగా సాగకపోవడం ఈ సినిమాకు మైనస్. అలాగే సుదీర్ఘంగా సాగే పోరాట సన్నివేశాలు కూడా అంతకగా ఆకట్టుకోలేవు. రామాయణం గురించి తెలియనివారికి, చిన్నపిల్లలకు ఈ చిత్రం నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
రాఘవ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. అతని ఆహార్యం ఆ పాత్రకు బాగా సెట్ అయింది. అయితే ఇంతవరకు రాముడిని మనం నీలిమేఘ శ్యాముడుగానే చూశాం. కానీ ఈ సినిమాలో ఓ కొత్త రాముడిని చూస్తాం. ఇలా చూడడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక జానకిగా కృతిసనన్ తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె పాత్రకు నిడివి చాలా తక్కువనే చెప్పాలి. రావణ్‌గా సైఫ్ అలీఖాన్ అద్భుతంగా నటించాడు. కానీ ఆయన పాత్రని తీర్చిదిద్దన విధానం మాత్రం సహజత్వానికి దూరంగా ఉంది. భజరంగ్‌గా దేవదత్త నాగె చక్కగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్ర హైలైట్ అయింది. శేషుగా సన్నీ సింగ్ పర్వాలేదనిపించాడు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్-అతుల్ సంగీతమే. జై శ్రీరామ్ పాటతో పాటు మిగిలిన పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment