
మాలీవుడ్‌లో హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. కోలీవుడ్‌లో విశాల్‌తో యాక్షన్ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా జగమే తంతిరం, ఆర్య సరసన కెప్టెన్ తదితర చిత్రాల్లో నటించిన ఈమె విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తీ(మట్టి కుస్తీ) చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలను అందుకున్నారు. అదే విధంగా ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ పూంగుళలీగా కీలక పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు.
ఇటీవల ఈమె తన గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను పుట్టినప్పుడు తన తండ్రి శ్రీలక్ష్మీ అనే పేరు పెట్టారని, అయితే అమ్మ మాత్రం ఐశ్వర్య అని పిలిచేదన్నారు. దీంతో చివరికి తన పేరు ఐశ్వర్య లక్ష్మిగా మారిందని చెప్పారు. నటిగా తనకు డ్రీమ్ పాత్ర అంటూ ఏమీ లేదని, అయితే విలన్ రోల్స్‌లో నటించడం ఇష్టం ఉండదని, అందుకే ఎప్పటికీ అలాంటి పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
తనకు కాంచీపురం పట్టు చీరలు, కేరళ సంప్రదాయ చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. అందుకే షూటింగ్ లేనప్పుడు చీరలు ధరించి ఫొటోషూట్ నిర్వహించుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు. నటుడు అభిషేక్ బచ్చన్, విజయ్ నటించిన చిత్రాలను ఎక్కువగా చూస్తానన్నారు. ఇకపోతే క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాను ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆయన్ని మనసులోనే ప్రేమిస్తూ వచ్చానని, అలాంటిది ఇప్పుడు క్రికెట్ క్రీడను చూడ్డానికి సమయం దొరకడం లేదన్నారు.
చదవండి: ఓటీటీ పరిశ్రమ సూపర్ హిట్
Comments
Please login to add a commentAdd a comment