సినిమా పరిశ్రమలో నటీమణుల లైంగిక వేధింపుల వ్యవహారంపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని నివేదికను ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం విడుదల చేసిందో, అప్పటి నుంచే నటీమణుల్లో ఒక ధైర్యం, తెగింపు వచ్చినట్లుంది. ఒక్కొక్కరూ తమ చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పడం మొదలెట్టారు. అది ఇప్పుడు కోలీవుడ్ వరకూ పాకింది. దీంతో కోలీవుడ్‌లోనూ హేమా కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలనే డిమాండ్ రావడంతో, దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) అలాంటి కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే, అలాంటి కమిటీ తమిళ చిత్రపరిశ్రమకు అవసరం లేదనే అభిప్రాయాన్ని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొనడం ఆసక్తిగా మారింది. నటిగా చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన నటి ఐశ్వర్యరాజేశ్. ఆదిలో చిన్న చిన్న పాత్రలు పోషించి స్వశక్తితో ఎదిగిన ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ పాత్రలనే కాకుండా దక్షిణాది ప్రముఖ నటిగా రాణిస్తున్నారు.
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక భేటీలో హేమా కమిటీ గురించి స్పందిస్తూ తనకు అలాంటిదేమీ జరగలేదు అన్నారు. అలాంటివి జరగకూడదనే కోరుకుందాం అన్నారు. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికి అలాంటి ఒక విషయం జరగలేదు. అందువల్ల తమిళ చిత్రపరిశ్రమలో హేమా కమిషన్ లాంటిది అవసరం లేదని పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా జరిగితే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని, అందుకు కారకులైన వారిపై కఠినశిక్ష వేయాలని పేర్కొన్నారు. మహిళల రక్షణే ముఖ్యం అని నటి ఐశ్వర్యరాజేశ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment