Allu Arjun: అల్లు అర్జున్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే | Allu Arjun Birthday Special Story: Know His Biography, Filmography, Success Journey And Interesting Facts - Sakshi
Sakshi News home page

Allu Arjun Birthday Special Story: అల్లు అర్జున్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే

Published Mon, Apr 8 2024 8:56 AM | Last Updated on Mon, Apr 8 2024 1:18 PM

Allu Arjun Birthday Special Story - Sakshi

'గంగోత్రి'తో ఒక నదిలా ఇండస్ట్రీలో  'పరుగు'లు పెడదామని ఎంట్రీ ఇస్తే.. 'ఎవడు' రా వీడు అంటూ వచ్చిన విపరీతమైన ట్రోల్స్‌ను  'హ్యాపీ'గా భరించి.. 'జులాయి' అనుకున్న వాడే 'దేశముదురు'లా మారి బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్ల 'రేసుగుర్రం' అయ్యాడు. 'రుద్రమదేవి'కి తోడుగా  గోన గన్నా రెడ్డిగా అవతారమెత్తి ఇండస్ట్రీకి 'సరైనోడు' వచ్చాడు రా అని చాటిచెప్పాడు. నేడు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉన్న టాప్‌ హీరోలతో పోటీ పడుతూ నీ యవ్వ తగ్గేదేల్యా అని 'పుష్ప' గాడి రూలింగ్‌ ప్రారంభించాడు. వారు మరెవరో కాదు అల్లు అర్జున్‌.. నేడు ఆయన  పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం.

అల్లు అర్జున్‌ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్‌ స్టార్‌ గుర్తుకొస్తాడు.. మల్లు అర్జున్‌ ఈ పేరు వింటే కేరళలో అభిమానులు ఊగిపోతారు. వీడు హీరో ఎంటి రా..? అనే స్థాయి నుంచి హీరో అంటే వీడు రా అనే రేంజ్‌కు చేరుకున్నారు బన్నీ. అగ్ర నిర్మాత తనయుడిగా.. అగ్ర కథానాయకుడికి మేనల్లుడిగా ఒక బరువు బాధ్యతలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అహర్నిశలు శ్రమించి సినీ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న నటుడు అల్లు అర్జున్‌. 'ఆడా ఉంటా.. ఈడా ఉంటా' అంటూ.. అటు క్లాస్‌ ఆడియన్స్‌ను, ఇటు మాస్‌ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోగా బన్నీ గుర్తింపు పొందారు.

ట్రోల్స్‌కు భయపడకుండా గట్టి సమాధానం ఇచ్చాడు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌- నిర్మల దంపతులకు 1982 ఏప్రిల్‌ 8న చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్‌ 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్య కూడా అక్కడే ముగిసింది. తాత స్టార్‌ కమెడియన్‌ (రామలింగయ్య), మామయ్య స్టార్‌ హీరో (చిరంజీవి), నాన్న స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఈ నేపథ్యంలో బన్నీ తెరంగేట్రం సులువుగా జరిగింది. 2003లో 'గంగోత్రి' సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్‌ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే  విజేత, స్వాతిముత్యంలో బాల నటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా 'డాడీ'లో డ్యాన్స్‌ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయి.

దీంతో గంగోత్రి విడుదల సమయంలో థియేటర్స్‌ అన్నీ హౌస్‌ఫుల్‌ బోర్డులు పడ్డాయి. ఇందులో ఆయన నటనకు ఎవరూ పేరు పెట్టలేదు కానీ  లుక్‌ పరంగా బారీగా ట్రోల్స్‌ ఎదుర్కొన్నాడు. వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనను తాను మార్చుకున్నాడు. అలా 'ఆర్య'తో గట్టి సమాధానమిచ్చాడు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ 'ఆర్య' అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయేలా చేశాడు.

మరో హీరో అయితే ఈ సినిమా చేసేవాడు కాదేమో
టాలీవుడ్ బెస్ట్ డాన్స‌ర్ గా అప్ప‌ట్లోనే చిరంజీవితో ప్ర‌శంస‌లు అందుకున్నాడు బ‌న్నీ. గంగోత్రి,ఆర్య,బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. తొలి మూడు సినిమాల‌తో వ‌ర‌స హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒక‌రు. ఆపై వెంట‌నే హ్యాపీ నిరాశ‌ ప‌రిచినా.. దేశ‌ముదురుతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చ‌రిత్ర సృష్టించాడు బ‌న్నీ. ఆ మ‌రుస‌టి ఏడాది ప‌రుగుతో త‌న న‌ట‌న‌ను చూపించాడు. 

వ‌రుడు, వేదం, బ‌ద్రీనాథ్,జులాయి,దువ్వాడ జగన్నాథం,రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ఫలానా సినిమాలో క్లైమాక్స్‌లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా?’ అని ఏ స్టార్‌ హీరోనైనా అడిగితే వెనకడుగేస్తుంటారు. కానీ, ఆ విషయంలో 'వేదం' కోసం బన్నీ ముందడుగేశాడు. 'రుద్రమదేవి' సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అర్జున్‌  పారితోషికం తీసుకోకుండానే గోనగన్నారెడ్డి పాత్ర పోషించి. ఆ సినిమాకు మరింత హైప్‌ క్రియేట్‌ చేశాడు. దీంతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. 

అల్లు అర్జున్‌ రూమ్‌లో వారిద్దరి ఫోటోలు
అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్‌లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్‌ది, మరొకటి చిరంజీవిదని, వాళ్లిద్దరినీ చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడ్డానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ అది ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్‌ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు. అలా  దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి.

ప్రయోగాలతో పాటు కష్టపడేతత్వం
ప్రతి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం. కానీ అతిథి పాత్ర. అయినా అల్లు అర్జున్ చేశారు. క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి.. విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. ప్రయోగం ఫలించని సందర్భమూ లేకపోలేదు. 'నా పేరు సూర్య' వైఫల్యమే దీనికి ఉదాహరణ.

సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు.

అల్లు లెగసీ
మెగా కాంపౌండ్‌ హీరో నుంచి తన సొంత కష్టంతో అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్‌ చేసుకున్నాడు. అలాగనే ఎన్నడూ మెగా అభిమానులను ఆయన తక్కువ చేయలేదు.  అర్జున్‌కి అభిమానులు మలయాళం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గతంలో కానీ, ప్రస్తుతం కానీ.. ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం. అక్కడ అంతా ఆయనని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్‌ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాధించుకున్నాడు. ఆ సినిమాతో అల్లు అర్జున్‌ క్రేజ్ ఒక్కసారిగా ఖండంతరాలను దాటింది.

సినిమా రంగంతో పాటు క్రికెట్‌, పాలిటిక్స్‌లో ఉండే సెలబ్రిటీల సైతం ఏదో ఒక సందర్భంలో.. 'నీయవ్వ తగ్గేదే లే' అని అల్లు అర్జున్ డైలాగ్‌ ఉపయోగించే ఉంటారు. అలా ఆయన పేరు మరింత వేగంగా జనాల్లోకి చొచ్చుకుని పోయింది. ఇంత రేంజ్‌కు ఆయన చేరుకోవడానికి ఆయన ప్రధాన బలం టాలెంట్. కంటెంట్‌తో పాటు టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైన తిరుగులేదని అల్లు అర్జున్ జీవితం తెలుపుతుంది.

ఫ్యామిలీ మ్యాన్
సినిమాలు, షూటింగ్‌లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు అల్లు అర్జున్‌. ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకొని మరీ భార్యాపిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు. ఇలా  మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ.. ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అని ఓ ఇంటర్య్వూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు.

అల్లు అర్జున్‌ గురించి ఈ విషయాలు తెలుసా

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్‌
రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌
ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ ఫాలోవర్స్‌ ఏకంగా 25 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్‌ కావడం విశేషం

'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్‌. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.
టాలీవుడ్‌లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్‌ప్యాక్‌ పరిచయం చేసింది అల్లు అర్జున్‌నే
బన్నీకి నటి ఐశ్వర్యరాయ్‌ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట

అల్లు అర్జున్‌కు బాగా నచ్చే సినిమాలు  టైటానిక్‌, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట
2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా  పుష్ప: ది రైజ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది
'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ
► 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్‌.. ఆ ప్రాజెక్ట్‌కు  తనలాంటి స్టార్‌ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు.

👉: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement