‘‘కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ల సీజన్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. తెలుగులో ‘వరుడు కావలెను, రొమాంటిక్’, తమిళ్‌లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు.. ఇదే పాజిటివిటీ కొనసాగాలి.. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలి. ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో మేము కూడా వస్తున్నాం.. మా సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నా. ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆల్ ది బెస్ట్. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘వరుడు కావలెను’లోని ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాటకి తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. చాలా అందగాడు. తనలో ఒక ఇన్నోసెన్స్, స్వీట్‌నెస్ ఉంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తి కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.. అవ్వాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్యకూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
రీతూ వర్మ మంచి నటి. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ వర్మ వద్ద చాలా ఉంటుంది. ముంబయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లోనూ సగం మంది మహిళలు ఉన్నారు.. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అలా కాకుండా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. లక్ష్మీ సౌజన్యకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి విశాల్, తమన్ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి చేయడానికి అహం ఉంటుంది.. అలాంటివేమీ లేకుండా చేసినందుకు వారిద్దరికీ అభినందనలు.
ఈ వేడుకకి రావడం ‘అల వైకుంఠపురములో..’ సినిమాకి కొనసాగింపుగా ఉన్నట్లు ఉంది. చినబాబు, త్రివిక్రమ్, నవీన్ నూలి, తమన్... ఇలా అందరూ ఉన్నారు. గీతా ఆర్ట్స్ తర్వాత నేను సొంత సంస్థగా భావించేది చినబాబు, నాగవంశీగారి బ్యానరే. ‘జెర్సీ’ కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మన చుట్టుపక్కల ఇళ్లలోని మనకు తెలిసిన ఒక ఆడపిల్ల తాలూకు సినిమా ఇది. ఇలాంటి కథలెప్పుడూ మన మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. ఈ కథని ఎంచుకోవడంలోనే సౌజన్య సగం సక్సెస్ అయ్యింది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు కాబట్టి మిగతా సగం కూడా సక్సెస్ అయినట్టే. ఇంట్రవెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో శౌర్య చాలా బాగా చేశాడు’’ అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాధాకృష్ణ, వంశీగార్లకు థ్యాంక్స్. ఓ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటం చాలా కష్టం (నవ్వుతూ). విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ వంశీ, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్ నవీన్ నూలి, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment