‘సరేలే బోండాం’ ‘నువ్వూ నీ తారుడబ్బా ముఖమూ’ ‘ఉఫ్పున ఊదితే ఎగిరిపోతావ్’ ఎవరినైనా ఉద్దేశించి ఇలా బాడీ షేమింగ్ చేయడం నేరం. సోషల్ మీడియాలో చేస్తే ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చు. కాని కోలకతా నటి శ్రుతి దాస్ పోలీస్ కంప్లయింట్ పెట్టింది. రంగు నలుపు అంటూ ఆమె పై చేసే వ్యంగ్య వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పోలీసుల దగ్గరకు చేరాయి. మీ మిత్రులు ఇలాంటి కూతలు కూస్తుంటే మీరు హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది.
హేళన చేయడం ద్వారా మనిషి కొంత ఆనందం పొందుతాడు. అయితే ఆ ఆనందం వికృత స్థాయికి చేరుకుంటే ఏం చేయాలి? హేళన ద్వారా మనిషిని బాధించడం, హాస్యం పుట్టించడం ఇవాళ చాలా వ్యాపారం అయిపోయింది. టీవీలలో వస్తున్న చాలామటుకు కామెడీ షోలు స్త్రీలను, వారి రూపాలను, వారి నడవడికను, లైంగిక ప్రవర్తనలను హేళన చేసేవే. బాడీ షేమింగ్ (శరీర అవయవాలను అవమానించడం), కలరిజం (శరీర వర్ణాన్ని బట్టి కామెంట్ చేయడం) నిజానికి ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఆ సంగతి తెలియక చాలామంది సోషల్ మీడియాలో విమర్శ పేరుతో హేళన చేస్తున్నారు. అలాంటి వారు ఇబ్బందుల్లో పడక తప్పదని కోలకటాలో తాజా ఘటన నిరూపించింది. అక్కడి టీవీ నటి శ్రుతి దాస్ తన రంగు తక్కువ అంటూ హేళన చేస్తున్న వారిపై కేసు పెట్టింది.
ఏం జరిగింది?
కోల్‌కటాలో టీవీ నటిగా ఉన్న శ్రుతి దాస్ గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘త్రినయని’ అనే టీవీ సీరియల్ హిట్ అయ్యింది. ‘నేను ఆ సీరియల్ దర్శకుడితో అనుబంధంలో ఉన్నాను. కాని సోషల్ మీడియాలో ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నా రంగు గురించి ప్రస్తావన చేస్తూ నన్ను హేళన చేస్తున్నారు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్‌లో నల్లగా ఉన్నవారిని ‘కాలో’(నల్లది), ‘మోయిలా’ (మాసినది) అని హేళన చేసేవాళ్లుంటారు. విమర్శ చేయాలంటే ఏ పాయింట్ లేనప్పుడు ఇలా రంగునో రూపాన్నో ప్రవర్తననో ముందుకు తెచ్చి కామెంట్ చేసి బాగా అన్నాం అని చంకలు గుద్దుకుంటారు కొందరు. కాని అలాంటివారిని వదిలేది లేదని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది.
స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే
సోషల్ మీడియాలో మనం ఏదైనా కామెంట్ చేస్తే దానికి శిక్షలు పడవనుకుంటే పొరపాటు. బాధింపబడినవారు పోలీస్ కంప్లయింట్ చేస్తే అలాంటి వారిని వెంటనే చట్టపరంగా శిక్షించడానికి కేసు నమోదు అవుతుంది. కొందరు కామెంట్ చేసి ఆ తర్వాత దానిని డిలీట్ చేయవచ్చు. కాని ఈలోపు ఆ బాధితులు ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అవి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. హేళన కూడా ఒక అణచివేత సాధనమే.
ఎదుటివారిని అణచివేయడానికి హేళనను ఆయుధంగా వాడుతారు. కాని అలాంటి రోజులు పోయాయి. స్త్రీలను, వృద్ధులు, వికలాంగులను, ఇంకా ఎవరినైనా గాని రూపాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, నేపథ్యాన్ని బట్టి హేళన చేస్తే, మనసు గాయపరిస్తే, అగౌరవపరిస్తే వారంతా చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ‘కాళీ మాత కూడా నల్లగానే ఉంటుంది. ఆమెను కొలుస్తాం మనం. కాని హేళన సమయంలో మాత్రం ఎదుటివారిని నల్లగా ఉన్నారని అంటాం. ఇది ఎంత తప్పో అందరూ ఆలోచించాలి’ అని శ్రుతి దాస్ అంది. ‘నలుపు నారాయణమూర్తే గాదా’ అని ఒక దేశీయగీతం ఉంది. ఏ రంగైనా ప్రకృతి దృష్టిలో ఒకటే. సంస్కారలోపం ఉన్నవారే వర్ణఅంతరాన్ని చూస్తారు.
Comments
Please login to add a commentAdd a comment