
హీరో విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ 'ఆదిత్య వర్మ' సినిమా ద్వారా కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. అయితే తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం, మహాన్ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ధృవ్ విక్రమ్ కెరీర్ ఇంకా పుంజుకోలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్ చిత్రాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.
స్పోర్ట్స్ డ్రామా..
నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదలై చాలా రోజులైంది. తర్వాత అంతా సైలెంట్‌గా ఉండటంతో ఈ చిత్రం అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇది కబడ్డీ క్రీడ నేపథ్యంలో యధార్థ సంఘటన ఆధారంగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ధృవ్ విక్రమ్ కబడ్డీ ఆటలో ఇప్పటికే శిక్షణ పొందుతున్నారని తెలిసింది.
అప్పటినుంచే షూటింగ్..
ఇందులో ఆయనకు జంటగా మలయాళ భామ దర్శనా రాజేంద్రన్ నటించనున్నారు. ఈమె ఇప్పటికే తమిళంలో కవన్, ఇరుంబు తిరై వంటి చిత్రాలలో నటించడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ మార్చి 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్‌ను పూర్తి చేయడానికి దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రణాళికను సిద్ధం చేశారట!
Comments
Please login to add a commentAdd a comment