చిన్న వయసులోనే కారు నడుపుతున్న ఈ హీరో ఇప్పుడు పెద్ద స్టార్. ఇతడి కంటే ఆయన తండ్రి ఇంకా పెద్ద స్టార్. అగ్రహీరో వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మాతృ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. మహానటిలో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు గతేడాది తెలుగులో హీరోగా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌తో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యాడు. అతడే దుల్కర్ సల్మాన్.
రెండో సినిమాతో సక్సెస్
మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్. ఇతడు 1986 జూలై 28న జన్మించాడు. ముందు చదువుపైనే ధ్యాస పెట్టిన ఇతడు దుబాయ్‌లో ఐటీ ఉద్యోగం చేశాడు. అయితే తండ్రి బాటలోనే నడవాలని మనసు లాగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా తిరిగొచ్చేశాడు. ముందుగా నటనలో శిక్షణ తీసుకుని సెకండ్ షో అనే మలయాళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతోనే సినీప్రపంచంలో అడుగుపెట్టాడు కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చేసిన ఉస్తాద్ హోటల్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు సైతం పొందాడు. ఆ తర్వాత ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసుకుంటూ పోయాడు.
సీతారామంతో అమాంతం పెరిగిన క్రేజ్
తమిళ, మలయాళంలోనూ సినిమాలు చేశాడు. తెలుగులో ఓకే బంగారం, మహానటి చిత్రాలతో కావాల్సినంత గుర్తింపు సంపాదించాడు. సీతారామం సినిమాతో దుల్కర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లెఫ్టినెంట్ రామ్‌గా అభిమానులు ఆయన్ను ఆరాధించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఉప్పొంగిపోయిన ఇతడు ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోట అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. జూలై 28న ఆయన బర్త్‌డే రోజు తెలుగులో మరో కొత్త సినిమాకు కూడా సంతకం చేసినట్లు వెల్లడించాడు. సార్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి లక్కీ భాస్కర్ టైటిల్ ఫిక్స్ చేశారు.
నేను ఎంతపెద్ద స్టార్ అయినా నా భార్య మాత్రం నన్ను కనీసం నటుడిగా కూడా చూడదు. మరోపక్క నాన్న(మమ్ముట్టి).. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయకపోతే ఇంట్లోకి కూడా రానివ్వనని కండీషన్ పెట్టాడు. ఒక్క సినిమా చేయడానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టనిస్తానని సరదాగా హెచ్చరిస్తూ ఉంటాడు.
- దుల్కర్ సల్మాన్
Comments
Please login to add a commentAdd a comment