ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పిటిషన్ దాఖలు చేసింది. ఒక హత్య కేసు కథాంశం చుట్టూ తెరకెక్కిన వెబ్ సిరీస్ విడుదలను ఆపాలని ఈమేరకు సీబీఐ కోరింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా డాక్యుమెంటరీ-సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్' పేరుతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఇందులో షానీ లెవీ, ఉరాజ్ బహల్ కీలక పాత్రలు పోషించారు. కొద్దిరోజుల క్రితం ఈ సిరీస్ నుంచి ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసు గురించి అందరూ మాట్లాడుకునేవారు. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీబీఐ కోర్జుకు వెళ్లింది. విచారణ ముగిసే వరకు ఈ వెబ్ సిరీస్‌ను ఆపాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రాసిక్యూటర్ సిజె నాండోడ్ ద్వారా కోర్టులో పిటీషన్ వేసింది.
దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొందరికి ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై ఫిబ్రవరి 20న విచారణ జరగనుంది. ఇంద్రాణీ తన కుమార్తె షీనా బోరాను డ్రైవర్ సహాయంతో హత్య చేసి సాక్ష్యాలను దాచి పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో, ఆమె జైలు జీవితాన్ని చూపిస్తూ ఒక ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
వాస్తవ ఘటనలో ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సుమారు 10 ఏళ్లు దాటిన ఈ కేసు ఇంకా తేలలేదు. సీబీఐ పిటీషన్‌తో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను ఆపేస్తారా..? ఇబ్బందులను దాటుకొని విడుదల చేస్తారో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment