కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్‌తో భరణి,పూజా చిత్రాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని, వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.
ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment