Gully Rowdy Review And Rating In Telugu: Cast, Highlights - Sakshi
Sakshi News home page

Gully Rowdy Review: సందీప్‌ కిషన్‌ ‘గల్లీ రౌడీ’ ఎలా ఉందంటే..

Published Fri, Sep 17 2021 1:40 PM | Last Updated on Fri, Sep 17 2021 8:57 PM

Gully Rowdy Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : గల్లీ రౌడీ
నటీనటులు : సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్‌, నాగినీడు, వెన్నెల కిషోర్‌, పొసాని కృష్ణ మురళి, మైమ్‌ గోపి తదితరులు
నిర్మాణ సంస్థ: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్
నిర్మాతలు :  యమ్‌.వి.వి సత్యనారయణ, కోన వెంకట్‌
దర్శకత్వం:  నాగేశ్వర రెడ్డి 
సంగీతం : రామ్‌ మిరియాల, సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: చోటా కె. ప్రసాద్‌
విడుదల తేది : సెప్టెంబర్‌ 17,2021

సినిమా.. సినిమాకి తన నటనతో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు యంగ్‌ హీరో సందీప్ కిషన్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయడు. అయితే కొద్దికాలంగా ఈ యువ హీరో కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన చేసిన సీనిమాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ‘గల్లీ రౌడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన  ట్రైలర్‌, చిత్రంలోని పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? చొక్కా , బుగ్గ మీద గాటు పెట్టుకొని కాకుండా కొంచం స్టైలిష్‌గా వచ్చిన ఈ ‘గల్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.


గల్లీరౌడీ కథేంటంటే..?
విశాక పట్నానికి చెందిన వాసు(సందీప్‌ కిషన్‌)ని పెద్ద రౌడీని చేయాలని కలలు కంటాడు తాత మీసాల సింహాచలం(నాగినీడు). దానికి కారణం తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్‌ గోపి)తో ఉన్న పాత కక్షలే. అయితే వాసుకు మాత్రం కొట్లాటలు అంటే అసలు నచ్చదు. కానీ తాత కోరిక మేరకు చదువు మధ్యలోనే ఆపేసి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతాడు. అయినప్పటికీ గొడవలకు దూరంగా ఉంటాడు. అయితే తను ఇష్టపడిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి) కోసం ఓ వీధి రౌడీని కొట్టడంతో వాసుపై రౌడీ షీట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలా సాహిత్య కోసం రౌడీగా మారిన వాసు.. ఆమె కుటుంబం కోసం బైరాగిని కిడ్నాప్‌ చేయడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా బైరాగి హత్యకు గురవుతాడు. ఈ కేసు విచారణ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, సీఐ రవి(బాబీ సింహ) చేతికి వెళ్తుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రవి తనదైన శైలీలో విచారణ సాగిస్తాడు. ఇంతకీ హంతకుడిని సీఐ రవి పట్టుకున్నాడా లేదా? అసలు ఆ హత్య చేసిందెవరు? హెడ్‌ కానిస్టేబుల్‌ పట్టపగలు వెంకటరావు(రాజేంద్ర ప్రసాద్‌) ఫ్యామిలీకి , బైరాగి హత్యకు ఏం సంబంధం? సీఐ రవి ఈ కేసును ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాడు? బైరాగికి మీసాల సింహాచలంకు మధ్య ఉన్న పాత కక్షలు ఏంటి? తాత కోరికను వాసు ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ

ఎవరెలా చేశారంటే..?
గల్లీరౌడీ వాసుగా సందీప్‌ కిషన్‌ అదొరకొట్టేశాడు. వంశంపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్‌వేర్‌ కావాలనుకొని, తాతకోసం మళ్లీ రౌడీగా మారడం, ఇష్టపడిన అమ్మాయి కోసం రిస్క్‌ చేయడం.. ప్రతి సీన్‌లో చాలా నేచురల్‌గా నటించాడు. హీరోగా కాకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది అతని పాత్ర. ఫైట్స్‌ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక సాప్ట్‌వేర్‌ సాహిత్య పాత్రలో నేహా శెట్టి అద్భుత నటనను కనబరిచింది. తెరపై చాలా అందంగా కనిపించింది. హెడ్‌ కానిస్టేబుల్‌ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్‌ తనదైన నటనతో నవ్వులు పూయించాడు. రౌడీ సీఐ రవిగా బాబీ సింహా మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. భూకబ్జాలకు పాల్పడే రౌడీ బైరాగి నాయుడిగా మైమ్‌ గోపి తనదైన నటనతో మెప్పించాడు.  హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్‌ తమదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. పొసాని, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

ఎలా ఉందంటే.. 
‘గల్లీ రౌడీ’మూవీ అందరికి తెలిసిన పాత కథే. తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకునే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయలనేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇలాంటి కథలో తెలుగు చాలానే వచ్చాయి. కథలో బలమైన పాయింట్‌ ఉన్ననప్పటికీ.. కథనం హెడ్‌ కానిస్టేబుల్‌ పట్టపగలు వెంకటరావు ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కిడ్నాప్‌ డ్రామా కూడా రోటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. నెక్స్ట్‌  ఏం జరుగుతుందనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. అయినప్పటికీ తనదైన స్క్రీన్‌ప్లేతో కొంతవరకు మ్యానేజ్‌ చేశాడు కోన వెంకట్‌. ఇంటర్వెల్‌ సీన్‌ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రౌడీలుగా ముసలి బ్యాచ్‌ను పెట్టడం కామెడీకి స్కోప్‌ దొరికింది.సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ‘పప్పా వెర్రి పప్పా’అంటూ వెన్నెల కిషోర్‌ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.  రామ్‌ మిరియాల, సాయి కార్తీక్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా రీరికార్డింగ్‌ అదిరిపోయింది. సుజాత సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫి పర్వాలేదు. ఎడిటర్‌ చోటా కె. ప్రసాద్‌ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement