టైటిల్: టిల్లు స్వ్కేర్
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం:మల్లిక్ రామ్
నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటింగ్: నవీన్ నూలి
విడుదల తేది: మార్చి 29, 2024
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌తో పాటు యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
టిల్లు స్వ్కేర్ కథేంటంటే..
రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్‌తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్‌తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
'డీజే టిల్లు' సక్సెస్‌కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్‌ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది.
ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్‌ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్‌తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్‌ప్రైజింగ్‌గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది.
'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్‌ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్‌డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్‌ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment