Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ | Indian 2: 2024 Bharateeyudu 2 Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Bharateeyudu 2 Telugu Review: ‘భారతీయుడు 2’ మూవీ ఎలా ఉందంటే..?

Published Fri, Jul 12 2024 1:17 PM | Last Updated on Sat, Jul 13 2024 10:32 AM

Indian 2: Bharateeyudu 2 Movie Review And Rating In Telugu

టైటిల్‌: భారతీయుడు 2(ఇండియన్‌ 2)
నటీనటులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్,స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం తదితరులు
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్
నిర్మాత: సుభాస్క‌ర‌న్ 
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌
విడుదల తేది: జులై 12, 2024

కమల్‌ హాసన్‌ నటించిన బెస్ట్‌ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

భారతీయుడు 2 కథేంటంటే..
చిత్ర అరవిందన్‌(సిద్దార్థ్‌), హారతి(ప్రియాభవాని శంకర్‌) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్‌ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్‌ డాగ్స్‌ అనే పేరుతో య్యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్‌.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్‌ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్‌ హాసన్‌) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్‌ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్‌ భారతీయుడుకి చేరతాయి. 

దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్‌(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్‌ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. 

ఈ క్రమంలో అరవిందన్‌ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్‌ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్‌ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్‌ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అ‍క్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్‌ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్‌ వర్కౌంట్‌ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్‌ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్‌ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్‌. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్‌. స్టోరీ లైన్‌ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి.  అయితే అందులో వర్కౌట్‌ అయిన ఎమోషన్ ఇందులో మిస్‌ అయింది. ప్రతి సీన్‌ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. 

స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్‌ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది.  భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి.  కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు.  సినిమా నిడివి( 3 గంటలు)  కూడా మైనస్సే.  కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్‌ లేదనే పార్ట్‌ 3 ప్లాన్‌ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ  ప్రేక్షకుడు సైతం కట్‌ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదు. 

భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్‌ గ్యాంగ్‌ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. 

కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది.  క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్‌ ఫ్యాక్‌తో కమల్‌ చేసే యాక్షన్‌ సీన్‌ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్‌ సీన్‌ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్‌ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది.   అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్‌ మాత్రం బాగుంది. 

ఎవరెలా చేశారంటే..
వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్‌ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్‌ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్‌ ఫ్యాక్స్‌తో కమల్‌ చేసే యాక్షన్‌ సీన్‌కి థియేటర్‌లో ఈళలు పడతాయి.

ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది.  అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే  చిత్ర అరవిందన్‌ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్‌ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్‌ ఆకట్టుకుంది. సిద్ధార్థ్‌ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్‌ స్పేస్‌ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్‌ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు.  వ్యాపారీ  సద్గుణ పాండ్యన్‌గా ఎస్‌ జే సూర్యకి పార్ట్‌ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. 

టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement