ఆత్మహత్య.. అన్ని సమస్యలకు పరిష్కారం కాదు! కానీ చాలామంది కష్టాలకు భయపడి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక, ఒత్తిళ్లను జయించలేక, తమ బాధలను ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం కాక లోలోపలే మదనపడి చనిపోవడమే నయమని ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని గుర్తించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కొందరు మానసిక స్థైర్యంతో ఆత్మహత్యల ఆలోచనల నుంచి బయటపడితే మరికొందరు దాన్నుంచి బయటకు రాలేక కుంగిపోతున్నారు. ఒకానొక సమయంలో తాను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని సంచలన విషయాన్ని బయటపెట్టాడు దిగ్గజ నటుడు కమల్ హాసన్.
నేను చనిపోతే ఇండస్ట్రీ బాధపడాలనుకున్నా
శనివారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన పై వ్యాఖ్యలు చేశాడు. కమల్ మాట్లాడుతూ.. 'నాకు 20-21 ఏళ్ల వయసున్నప్పుడు నేను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. ఇండస్ట్రీలో నాకు మంచి అవకాశాలు రావడం లేదని, తగినంత గుర్తింపు లభించట్లేదని ఫీలయ్యాను. నేను చనిపోతే.. ఎంతో ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని చిత్రపరిశ్రమ బాధపడుతుందని భావించాను. నా గురువు అనంతుకు కూడా ఇదే విషయం చెప్పాను. ఆయన నీ పని నువ్వు చేసుకుంటూ పో.. సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు దానంతటదే వస్తుందని సలహా ఇచ్చాడు. దీంతో నాక్కూడా ఆత్మహత్య చేసుకోవడం సబబు కాదనిపించింది. హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం, పాపం.
చావు కోసం మనం ఆలోచించకూడదు!
చీకటి అనేది జీవితంలో శాశ్వతంగా ఉండిపోదు. లైఫ్‌లోకి కచ్చితంగా వెలుగు వస్తుంది. చీకటిని అంతం చేస్తుంది. అబ్దుల్ కలాం సర్ చెప్పినట్లు నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు కల అంటే.. మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేదే అసలైన కల. చావు అనేది కూడా జీవితంలో ఒక భాగమే.. కానీ దాని కోసం మనం ఎదురుచూడకూడదు. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మీ కలను, లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. అది నెరవేరుతుందా? లేదా? అన్నది పక్కన పెట్టండి. దానికోసం ఏం చేయాలో అది ముందు ఆలోచించండి అంటూ అక్కడున్న విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాడు కమల్ హాసన్.
Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఆనాడు హోటల్ బయట నిల్చుని ఏడ్చిన కోవై సరళ.. పదో తరగతిలోనే గర్భిణీగా.. పెళ్లెందుకు చేసుకోలేదంటే?
Comments
Please login to add a commentAdd a comment