సాక్షి, విజయవాడ: మహానేత వైఎస్సార్ జ్ఞాపకాలను తాము ఎన్నటికీ మరచిపోలేమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కొండా’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కొండా సురేఖ, చిత్ర యూనిట్ సోమవారం విజయవాడకు విచ్చేసింది. తొలుత పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘ఎన్నాళ్లయినా రాజశేఖరన్న జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాం. ఈ రోజు మేమీ స్థాయిలో ఉన్నామంటే.. అది రాజన్న పెట్టిన భిక్షే. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌ను మరువలేం. ఆయన ఆశయాలను గౌరవిస్తూనే నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నాం.’ అంటూ భావోద్వేగ పర్యంతమయ్యారు.
వైఎస్సార్ అభిమానిగా తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, ‘కొండా’ సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించాలని భావించి నగరానికి వచ్చినట్లు సురేఖ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా ఉందని ఆమె విమర్శించారు. ప్రమోషన్‌లో భాగంగా ‘కొండా’ చిత్ర విశేషాలను సురేఖ వివరించారు. ఆమె వెంట చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment