టైటిల్: మార్క్ ఆంటోని
నటీనటుటు: విశాల్, ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతువర్మ, అభినయ తదితరులు
నిర్మాత: ఎస్ వినోద్ కుమార్
రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023
కథేంటంటే..
ఈ సినిమా కథ 1975-1995 మధ్య కాలంలో జరుగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్‌లో గతంలోకి వెళ్లే టెలిఫోన్‌ని కనిపెడతాడు. దానికి కొన్ని కండీషన్స్ ఉంటాయి. అయితే అది కనిపెట్టిన కొద్ది రోజులకే అతను చనిపోతాడు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ(విశాల్) మరణించడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్‌జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు.
మార్క్‌కి తండ్రి ఆంటోనీ అంటే ద్వేషం. తన తల్లిని అతనే చంపాడని భావిస్తాడు. తండ్రిలా తాను రౌడీ కావొద్దని, కత్తులకు, తుపాలకు దూరంగా ఉంటూ మెకానిక్‌గా పని చేసుకుంటాడు. 1975లో చిరంజీవి కనిపెట్టిన టైమ్ ట్రావెల్ టెలిఫోన్ మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి? ఆంటోనీ ఎలా మరణించాడు? మరణించిన తండ్రిని మార్క్ ఎలా బతికించుకున్నాడు? మార్క్ తల్లిని హత్య చేసిందెవరు? ఈ కథలో ఏకాంబరం(సునీల్) పాత్ర ఏంటి? రమ్య(రీతూ వర్మ)తో మార్క్ ప్రేమాయణం ఎక్కడికి దారి తీసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే మార్క్ ఆంటోనీ. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. టైమ్ ట్రావెల్ టెలిఫోన్ సహాయంతో గతంలోకి వెళ్లిన తర్వాత ఎస్ జే సూర్య పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఎలాంటి సాగదీత లేకుండా కథ స్పీడ్‌గా ముందుకు సాగుతుంది.
సైంటిస్ట్ చిరంజీవి 1975లో గతంలోకి వెళ్లే టెలిఫోన్‌ని కనిపెట్టే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ 1995కి షిఫ్ట్ అవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎస్‌జే సూర్య కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ పాత్రలు పండించే కామెడీ, డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. అయితే టైమ్ ట్రావెల్ మిషన్‌తో ప్రతిసారి గతంలోకి వెళ్లడం..మళ్లీ ప్రస్తుత కాలంలోకి రావడం.. కొన్ని చోట్ల ఆడియన్స్ కాస్త గందరగోళానికి గురవుతారు.
ఇంటర్వెల్ వరకు కథ యమ స్పీడ్‌గా ముందుకు వెళ్తుంది. ఇక సెంకడాఫ్‌లో కథ నెమ్మదిగా సాగుతుంది. రిపీట్ సీన్స్ కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. టెలిఫోన్‌ని ఉపయోగించి చనిపోయిన వారిని బతికించుకోవడం కొంతవరకు ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది కానీ ప్రతిసారి ఆ తరహా సన్నివేశాలే రిపీట్ కావడం ఇబ్బందిగా, గందరగోళంగా అనిపిస్తుంది.
క్లైమాక్స్‌కి ముందు వచ్చే అనకొండ(మిషన్ గన్) ఫైట్ సీన్ అయితే హైలైట్. ఈ సన్నివేశంలో విశాల్ ఎంట్రీ, గెటప్ అదిరిపోతుంది. ఓవరాల్‌గా ఎలాంటి లాజిక్కులు వెతక్కుండా వెళ్తే ‘మార్క్ ఆంటోనీ’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడం విశాల్‌కు అలవాటు. మార్క్ ఆంటోనిలో కూడా వైవిధ్యమైన పాత్రనే పోషించాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలకు తనదైన నటనతో న్యాయం చేశాడు. లుక్ పరంగానూ వ్యత్యాసం చూపించాడు. ఇక క్లైమాక్స్‌లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర ఎస్‌జే సూర్యది. జాకీ మార్తాండగా, అతని కొడుకు మార్తాండ్‌గా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. తెరపై ఆయన పండించిన కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. విశాల్, సూర్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు.
ఇక గ్యాంగ్‌స్టర్ ఏకాంబరం పాత్రకు సునీల్ న్యాయం చేశాడు. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త చిరంజీవి పాత్రలో సెల్వ రాఘవన్ తన పరిధిమేర చక్కగా నటించాడు. రీతూ వర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment