Middle Class Melodies Review, Rating, in Telugu | మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్ మూవీ రివ్యూ | Anand Devarakonda - Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్ మూవీ రివ్యూ

Published Fri, Nov 20 2020 4:48 PM | Last Updated on Sat, Nov 21 2020 9:26 AM

Middle Class Melodies Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్
నటీనటులు :  ఆనంద్‌ దేవరకొండ,  వర్ష బొలమ్మ, చైతన్య గరికపాటి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్‌
నిర్మాత:  వెనిగళ్ళ ఆనందప్రసాద్‌ 
దర్శకత్వం: వినోద్‌ అనంతోజు
సంగీతం: స్వీకార్‌ అగస్తీ, ఆర్‌హెచ్‌ విక్రమ్‌
సినిమాటోగ్రఫీ: సన్నీ కురపాటి
ఎడిటర్‌ : రవితేజ గిరజాల
విడుదల తేది : నవంబరు 20, 2020 ( అమెజాన్‌ ప్రైమ్‌)

కరోనా మహమ్మారి కారణంగా సినిమా థీయేటర్లన్నీ మూతబడటంతో ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు.  చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ కూడా అదేబాటలో నడిచాడు. ఆయన హీరోగా నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..

కథ
పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్‌ పెట్టాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ ఇది. గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో చిన్న హోటల్‌ యజమాని కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ(ఆనంద్‌ దేవరకొండ). రాఘవ బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. తనకు వచ్చిన పనితోనే ఫేమస్‌ అయిపోవాలని కలలు కంటాడు. గుంటూరులో ఓ హోటల్‌ పెట్టి తన బొంబాయి చట్నీ రుచి అందరికి చూపించి పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశపడతాడు. కానీ హోటల్‌ పెట్టడం అతని తండ్రి కొండలరావుకు మాత్రం అస్సలు నచ్చదు. అయినప్పటికీ కొడుకు బాధ చూడలేక హోటల్‌ ఏర్పాటుకు అంగీకరించి డబ్బులు ఇస్తాడు.

మరోవైపు వరసకు మామయ్య అయ్యే నాగేశ్వరరావు (ప్రేమ్‌ సాగర్‌) కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. కానీ నాగేశ్వరావు మాత్రం కూతురు సంధ్యను వేరే వాళ్లకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు? సంధ్యను పెళ్లి చేసుకోవడానికి రాఘవ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? హోటల్‌ ఏర్పాటుకి సంధ్య ప్రేమకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు తరుణ్‌ భాస్కర్‌ ఏ పాత్రలో కనిపించాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. ఇలాంటి సినిమాల్లోని ఎమోషన్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్’ కథ కొత్తదేమి కాదు. అందరికి తెలిసిన కథే. అయినప్పటికీ దర్శకుడు వినోద్‌ తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇలాంటి నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని సాహసమే చేశాడని చెప్పొచ్చు. తొలి సీన్‌తోనే పాత్రలను పరిచయం చేసి, అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఏ సన్నివేశం కూడా తెచ్చిపెట్టినట్టు కాకుండా సాఫీగా కథలో భాగంగా కొనసాగుతుంది. పల్లె ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో అచ్చం అలాగే సినిమాలో చూపించారు.

గుంటూరు నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆ యాసను, అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించారు. మధ్య తరగతి కష్టాలెలా వుంటాయనేది డ్రామా లేకుండా సహజంగా చూపించారు. పాటలు కూడా తెచ్చిపెట్టినట్టు కాకుండా కథలో భాగంగా వచ్చిపోతాయి. ఫస్టాఫ్‌ మొత్తం చాలా సాఫీగా, బోర్‌కొట్టకుండా నడిపించిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌ను మాత్రం కాస్త నెమ్మదిగా కొనసాగించాడు. హోటల్‌ పెట్టాక హీరోకి వచ్చిన ఇబ్బందులను తెరపై సరిగా చూపించలేకపోయాడు. చట్నీ రుచిగా లేకపోవడం, ఎన్నిసార్లు ప్రయోగం చేసినా ఫలించకపోవడం, చివరకు మామిడి కాయను చూడగానే ఏదో ఐడియా వచ్చినట్లు హీరో ఫీలై.. సక్సెస్‌ కావడం కన్వినెన్స్‌గా అనిపించదు. హీరో ఫ్రెండ్‌ లవ్‌ స్టోరిని చూపించినంత ఆసక్తిగా హీరో, హీరోయిన్ల లవ్‌ స్టోరీ చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరోయిన్‌ పెళ్లి చూపుల సీన్‌ కూడా సాగతీతగా అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా చూసిన ప్రతి మధ్యతరగతి యువకుడు తనను తాను హీరో పాత్రతో పోల్చుకుంటాడు. 

నటన 
ఆనంద్ దేవరకొండకు రెండో సినిమా ఇది. మొదటి సినిమా దొరసానితో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్‌ నటన కాస్త మెరుగుపడింది. మధ్యతరగతి కుర్రాడిగా ఆనంద్‌ చక్కగా ఒదిగిపోయాడు. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడికి ఉండే కోపం, బాధ, ఫన్‌ను చక్కగా చూపించాడు. అయితే గుంటూరు నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ ఆనంద్‌ గుంటూరు యాసను పలికించడంలో కాస్త తడబడ్డాడు. ఎంత ట్రై చేసినప్పటికీ అతనిలో హైదరాబాద్‌ యాసే కనిపిస్తోంది. సంభాషణల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక హీరో తండ్రి కొండలరావు పాత్రలో గోపరాజు రమణ జీవించేశాడు. మధ్యతరగతి తండ్రి ఎలా ఉంటాడో అచ్చం అలాగే నటించాడు. ఆయన కోపంలోనే హాస్యాన్ని పండించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు కొండలరావు పాత్ర కచ్చితంగా గుర్తుండిపోతుంది. వర్ష బొలమ్మ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్‌ కూడా కొత్తగా ఉన్నాయి. పల్లెటూరు జనాలు మాట్లాడే మాటలనే సినిమాలో వాడారు. అయితే కాస్త బూతులు తగ్గిస్తే బాగుండేది. స్వీకార్ అగస్తి పాటలు.. ఆర్‌హెచ్‌ విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకు ప్లస్ అయ్యాయి. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గుంటూరు అందాల్ని చక్కగా తెరపై చూపించాడు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 



ప్లస్‌ పాయింట్స్‌‌
ఆనంద్‌ దేవరకొండ నటన
పాత్రల చిత్రీకరణ
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌
కొత్తదనం లేకపోవడం
క్లైమాక్స్‌ సింపుల్‌గా ఉండటం
తెలిసిన కథ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement