
‘‘సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీతో రూపొందిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. ఈ సినిమాలో తల్లి పాత్ర చేయడానికి ఆలోచించలేదు. ఓ నటిగా అన్ని పాత్రలూ చేయాలి. ఈ మూవీలో నివేదా థామస్ కాకుండా నేను చేసిన సరస్వతి పాత్రే కనిపిస్తుంది’’ అని హీరోయిన్ నివేదా థామస్ అన్నారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’.
నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘నంద కిశోర్ ‘35–చిన్న కథ కాదు’ కథని అద్భుతంగా రాశారు. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్... ఇలాంటి బంధాల గురించి అందంగా చెప్పారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ కె. విశ్వనాథ్‌గారి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిని కూడా ఓ పాత్రలా చూపించారు దర్శకుడు’’ అన్నారు.
హేమాలాంటి కమిటీలు రావాలి: ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలో ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. ‘అమ్మ’లో నేను ఓ సభ్యురాలిని. హేమా కమిటీ నివేదికలో వెలుగు చూసిన అంశాలు బాధాకరం. ఆ విషయాల గురించి నేను నా కుటుంబ సభ్యులతో కూడా చర్చించాను. ఈ విషయంలో డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)ని ప్రశంసించాలి. పని చేసే చోట మహిళలకు భద్రత కల్పించడం కనీస అవసరం. దీని గురించి నేనూ వినతి చేశాను. మలయాళ చిత్ర పరిశ్రమలోలాగే ఇతర ఇండస్ట్రీల్లోనూ హేమా లాంటి కమిటీలు వస్తే మంచిదే’’ అన్నారు నివేదా థామస్.
Comments
Please login to add a commentAdd a comment