టైటిల్: ఓం భీమ్ బుష్
నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు
సమర్పణ: యూవీ క్రియేషన్స్
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
సంగీతం: సన్నీ ఎమ్‌ఆర్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం
ఎడిటింగ్: విజయ్ వర్ధన్
విడుదల తేది: మార్చి 22, 2024
‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే?
కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్‌డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్‌డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు.
సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్‌లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్‌కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్‌ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్‌ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్‌స్టోరీని చెప్పాడు.
టైటిల్‌లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్‌మెంట్ సీన్‌కి థియేటర్స్‌లో పగలబడి నవ్వుతారు.
అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్‌కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్‌కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు.
సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్‌గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్‌గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు.
ఎవరెలా చేశారంటే..
ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్‌గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు.
సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్‌లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment