Rajinikanth, Chiranjeevi And Jr NTR Gives Chance To Young Directors - Sakshi
Sakshi News home page

లక్‌ అంటే ఈ డైరెక్టర్లదే.. అప్పుడే స్టార్‌ హీరోలతో సినిమాలు!

Published Fri, Oct 7 2022 3:23 PM | Last Updated on Fri, Oct 7 2022 5:04 PM

Rajinikanth, Chiranjeevi, Jr NTR Gives Chance To Yong Dirctors - Sakshi

స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడు అయినా అనుకుంటారు. ఈ సువర్ణావకాశం కోసం కొందరు దర్శకులు చాలాకాలం ఎదురుచూస్తుంటారు. కానీ కొందరు డైరెక్టర్లకు మాత్రం తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోకి ‘స్టార్ట్‌ యాక్షన్‌’ చెప్పే చాన్స్‌ వస్తుంది. ఇప్పుడలాంటి  కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ‘స్టార్‌ హీరో’లు ‘యంగ్‌ కెప్టెన్‌’ (డైరెక్టర్లను కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు)ల కాంబినేషన్‌లో సెట్‌ అయిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.



సిల్వర్‌ స్క్రీన్‌పై రజనీకాంత్‌ క్రేజ్‌ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. ఇంతటి స్టార్‌డమ్‌ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడు అయినా ఆశపడుతుంటారు. ఈ చాన్స్‌ కనీసం మూడు సినిమాలను కూడా తెరకెక్కించని ఓ దర్శకుడికి లభిస్తే అది కాస్త ఆశ్చర్యమే. తమిళ చిత్రం ‘డాన్‌’తో దర్శకుడిగా పరిచయమైన సిబీ చక్రవర్తికి చాన్స్‌ ఇవ్వనున్నారు రజనీకాంత్‌. ఆల్రెడీ ఈ సూపర్‌ స్టార్‌ను కలిసి సీబీ చక్రవర్తి ఓ లైన్‌ వినిపించారు. పూర్తి కథను రెడీ చేసి, నరేషన్‌ ఇస్తే సినిమా చేస్తానని సీబీ చక్రవర్తికి మాట ఇచ్చారట రజనీ. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘జైలర్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రదర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా యువదర్శకుడే కావడం విశేషం. నెల్సన్‌ కెరీర్‌లో ‘జైలర్‌’ చిత్రం నాలుగోది.   



చిరంజీవి స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాస్టార్‌ రీసెంట్‌గా యువదర్శకుడు వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో మంచి హిట్స్‌ సాధించిన జోష్‌లో వెంకీ కుడుముల ఉన్నా రన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్‌ ఓ కొలిక్కి వచ్చాక వెంకీ కుడుములతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. 



∙‘బాహుబలి’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్‌. ఈ స్టార్‌ హీరో 25వ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్‌ను దక్కించుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ‘స్పిరిట్‌’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’తో దర్శకుడిగా హిట్‌ సాధించిన సందీప్‌ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌తో ‘కబీర్‌ సింగ్‌’గా తీసి, అక్కడా హిట్‌ సాధించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చాన్స్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ అనే సినిమా చేస్తున్నారు సందీప్‌.  



కెరీర్‌లో పాతిక సినిమాలు చేసి, అగ్రహీరోల జాబితాలో కొనసాగుతున్నారు హీరో ఎన్టీఆర్‌. అయితే జస్ట్‌ ఒకే ఒక సినిమా ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్న బుచ్చిబాబు సనకి అవకాశం ఇచ్చారు. రెండో సినిమానే యంగ్‌ టైగర్‌తో చేసే అవకాశం బుచ్చిబాబుకి లభించడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్‌ ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఈ సినిమా షూటింగ్‌ నవంబరులో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు ఎనీ్టఆర్‌. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్‌–బుచ్చిబాబు సినిమా సెట్స్‌కి పైకి వెళుతుందట.  



∙ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఖాతాలో ఓ భారీ సినిమానే ఉంది. ఈ సినిమాకి శంకర్‌ దర్శకుడు. ఈ చిత్రం తర్వాత చరణ్‌ నెక్ట్స్‌ మూవీ తెలుగులో ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్‌ సినిమాలను తీసిన యువ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్‌చరణ్‌ మరో యువ దర్శకుడితో సినిమా చేయనున్నారనే టాక్‌ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కన్నడంలో ‘మఫ్తీ’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై సూపర్‌ హిట్‌ సాధించిన నార్తన్‌యే ఈ దర్శకుడు. రామ్‌చరణ్‌ కోసం నార్తన్‌ ఓ కథను రెడీ చేశారట. ఇది చరణ్‌కు కూడా నచ్చిందట. దీంతో శంకర్‌ ప్రాజెక్ట్‌ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా చేయబోయేది నార్తన్‌ దర్శకత్వంలోనే అనే టాక్‌ వినిపిస్తోంది. అంతే కాదు.. కోలీవుడ్‌ యువ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కూడా రామ్‌చరణ్‌కు ఓ కథ వినిపించారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.  



దర్శకుడిగా రెండు సినిమాలే (తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్‌ దే’) చేసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్‌’ (తమిళంలో ‘వాత్తి’) అనే సినిమా చేస్తున్నారు. అలాగే తమిళంలో 2021లో వచి్చన ‘రాకీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అరుణ్‌ మాథేశ్వరన్‌. ఆ తర్వాత ‘సాని కాయిదమ్‌’  (తెలుగులో ‘చిన్ని’) అనే సినిమా చేశారు. ప్రస్తుతం మూడో సినిమానే ధనుష్‌తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు అరుణ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. 

వీరే కాదు.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన కేవీ అనుదీప్‌ ఇటీవల విక్టరీ వెంకటేశ్‌కు, ‘రన్‌ రాజా రన్‌’, ‘సాహో’ చిత్రాల ఫేమ్‌ సుజిత్‌కి పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందని టాక్‌. ఇంకా యువ దర్శకులతో సినిమాలు చేసే టాప్‌ హీరోల జాబితా పెరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement