హీరోగా మెప్పించారు.. కమెడియన్‌గా నవ్వించారు.. తండ్రిగా ఎమోషన్స్ పండించారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయారు నటుడు చంద్రమోహన్. ఎమోషనల్ పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించగల సమర్థుడు. ఆయన నేడు(నవంబర్ 11న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి యావత్ తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఏడిపించారు.
35 ఎకరాల ద్రాక్ష తోట
50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దిగ్గజ నటుడు వెయ్యి సినిమాల మార్క్‌ను చేరుకుంటాడనుకునే సమయంలో రిటైర్‌మెంట్ ప్రకటించారు. అనారోగ్యంతో కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే 900కు పైగా చిత్రాలు చేసినప్పటికీ తనకు పెద్దగా ఆస్తి లేదని, ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే కోల్పోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో చంద్రమోహన్ ఏమన్నారంటే.. హైదరాబాద్‌లోని కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట కొన్నారు. ఆయనను కూడా కొనమని చెప్పారు. సరేనంటూ.. చంద్రమోహన్ 35 ఎకరాల దాకా కొన్నారు.
శోభన్‌బాబు వద్దన్నా వినలేదు
కానీ తర్వాత దాన్ని చూసుకోవడం వీలుపడలేదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని అలాగే తన దగ్గర పెట్టుకోవడమని ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అంతా అమ్మేశారు. అంతేకాదు, ఉన్న భూమిని అమ్ముకోవద్దని శోభన్‌బాబు చెప్తున్నా వినకుండా చెన్నైలో 15 ఎకరాలు అమ్మేశారు. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లపైనే ఉంది. అటు శంషాబాద్‌లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాలు కొన్నారు. కానీ చివరకు దాన్ని కూడా కాపాడుకోకుండా అదీ అమ్మేశారు.
సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ!
ఇలా దాదాపు వందకోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని సదరు ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని బాధపడ్డారు. చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందంటారు చాలామంది. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో.. జనవరి ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి తన భర్త చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర వెల్లడించింది. స్టార్ నటుడిగా జేజేలు అందుకున్న ఆయన తన చివరి రోజుల్లో సాదాసీదా జీవితం గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment