ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్‌లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.
అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.
అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.
కాగా.. శివరాజ్ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్‌లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment