శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ | Sridevi Soda Center Movie Review and Rating in Telugu | Sakshi
Sakshi News home page

Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

Published Fri, Aug 27 2021 1:33 PM | Last Updated on Sat, Aug 28 2021 8:03 AM

Sridevi Soda Center Movie Review and Rating in Telugu - Sakshi

టైటిల్‌: శ్రీదేవి సోడా సెంటర్‌
నటీనటులు: సుధీర్‌ బాబు, ఆనంది, నరేశ్‌, పావల్‌ నవగీతమ్‌, తదితరులు
దర్శకత్వం: కరుణ కుమార్‌
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
నిర్మాణ సంస్థ: 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌
విడుదల తేదీ: 27 ఆగస్టు 2021

Sridevi Soda Center Movie Review: సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం​ ‘శ్రీదేవి సోడా సెంటర్'. అమలాపురం బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమాకు 'పలాస 1978' డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించారు. 'వి' పరాజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ఎలక్ట్రీషియన్‌ సూరిబాబుగా నటించిన హీరో తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు.

కానీ వీరి ప్రేమ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరాఖరకు ఏ తీరానికి చేరుకుందనేది మిగతా కథ. 'చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. కానీ మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారని ఎంతో ధీమాగా చెప్పాడు సుధీర్‌ బాబు. మరి ఆగస్టు27న విడుదలైన ఈ సినిమా నిజంగానే జనాలను కట్టిపడేసిందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!

కథ
సూరిబాబు (హీరో సుధీర్‌ బాబు) అమలాపురంలో ఎలక్ట్రీషియన్‌. ఓ గుడిలో లైట్‌ సెట్టింగ్‌ వేస్తున్న సమయంలో అక్కడ సోడాలు అమ్ముకునే శ్రీదేవి(ఆనంది)ని చూసి లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు. దానికితోడు సూరిబాబును తక్కువ కులం అని వారి ప్రేమను భగ్నం చేయాలనుకుంటాడు.

మరోపక్క మూడు ముళ్లు వేసేందుకు మనసులు కలిస్తే సరిపోదని, కులం కూడా కలవాలంటూ ఈ ప్రేమజంట పెళ్లికి విముఖత చూపిస్తారు పెద్దలు. ఇంతలో ఆ గ్రామంలో హత్య జరుగుతుంది. దానికి సూరిబాబే కారణమని అతడిని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు జైలు నుంచి విడుదలయ్యాడా? అతడు జైలు నుంచి తిరిగొచ్చేలోపు శ్రీదేవి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందా? లేదా కులం కట్టుబాట్లను దాటుకుని సూరిబాబుతో ఏడడుగులు నడిచిందా? అదీ కాకుండా పెద్దల మనసు మార్చి వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారా? అసలు సూరిబాబుకు ఆ హత్యకు సంబంధం ఏంటి? విలన్‌ కాశీ, హీరోయిన్‌ తండ్రి చావుకు కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో బొమ్మ చూడాల్సిందే!

విశ్లేషణ
సుధీర్‌ బాబు సిక్స్‌ప్యాక్‌ కోసం పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. అతడి పర్ఫామెన్స్‌ను, అప్పియరెన్స్‌ను అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు. ఇక కథ స్టార్ట్‌ అవడమే జైలు సన్నివేశంతో మొదలవుతుంది. తర్వాత వచ్చే బోట్‌ సీన్లు, ఫైటింగ్‌, బీజీఎమ్‌ ఓ లెవల్లో ఉంటాయి. పల్లెటూరి అందాలను తెరపై మనోహరంగా చూపించారు. కామెడీ, ప్రేమ కథతో ఫస్ట్‌ హాఫ్‌ అలా అలా సాగిపోతుంది. లవ్‌ స్టోరీ కొంత రొటీన్‌గా అనిపించక మానదు. పైగా కథలో పలు సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉండటం నెగెటివ్‌ అని చెప్పొచ్చు.

సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. శ్రీదేవిని విలన్‌కిచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. అయినప్పటికీ శ్రీదేవి అతడితో జీవించేందుకు అంగీకరించదు. హీరో రాక కోసం నిరీక్షిస్తుంది. అతడితో వెళ్లిపోవాలని డిసైడ్‌ అవుతుంది. ఈ క్రమంలో కథను ఊహించని మలుపు తిప్పుతాడు డైరెక్టర్‌. ఎమోషనల్‌ సీన్లతో ప్రేక్షకులను కంటతడి పెట్టించే ప్రయత్నం చేశాడు. కానీ నత్తనడకన సాగే కథతో ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాడు. ఇక కథ చివర్లో వచ్చే క్లైమాక్స్‌ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది. సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడికే మరికొంత మసాలా వేసి జనాలకు వడ్డించాడు డైరెక్టర్‌. 

నటీనటులు
సుధీర్‌ బాబు సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్రలో జీవించేశాడు. లవ్‌ సీన్లు, ఎమోషనల్‌ సీన్లలో ఇరగదీశాడు. హీరోయిన్‌ ఆనంది కూడా సుధీర్‌తో పోటీపడి మరీ నటించింది. నరేశ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్
క్లైమాక్స్‌
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
రొటీన్‌ కథ
♦ ఫస్టాఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement