Lokendra Singh: అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లితెర నటుడు లోకేంద్ర సింగ్ రాజవత్‌కు వైద్యులు ఒక కాలు తొలగించారు. రక్తపోటు, తీవ్ర ఒత్తిడి, డయాబెటిస్ వంటి సమస్యల కారణంగా మోకాలి వరకు కాలును తీసేయాల్సి వచ్చిందని అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "నా కుడి పాదంలో చిన్న కణతి ఏర్పడింది. మొదట నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది ఇన్‌ఫెక్షన్‌లా మారి ఎముక మజ్జలోకి వ్యాపించింది. తర్వాత కండరాల్లోని మాంసాన్ని తినేసే గాంగ్రేన్ ఎటాక్ అయింది. వీటి నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి మోకాలి వరకు కాలును తీసేయక తప్పలేదు. నిజానికి పదేళ్ల క్రితం మధుమేహం బారిన పడినప్పుడే నా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఉండుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమో" అని చెప్పుకొచ్చాడు.
ఇక కరోనా తర్వాత అవకాశాలు తగ్గడంపై ఆయన మాట్లాడుతూ.. 'కోవిడ్‌కు ముందు చేతినిండా పనుండేది. కానీ రానురానూ అవి తగ్గుతూ వచ్చాయి. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కానీ సింటా(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎంతో కొంత సాయం చేసింది. కొంతమంది నటీనటులు నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ మనోధైర్యాన్ని అందిస్తున్నారు' అని తెలిపాడు. ఇదిలా వుంటే లోకేంద్రసింగ్ ప్రముఖ ధారావాహిక 'జోధా అక్బర్'తో పాటు 'యే హై మొహబ్బతే', 'సీఐడీ', 'క్రైమ్ పెట్రోల్' వంటి సీరియళ్లలోనూ నటించాడు. సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన 'మలాల్' సినిమాలోనూ కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment