
ముద్దు సన్నివేశాలు అనేవి ఇప్పటి సినిమాల్లో కామన్ అయిపోయాయి. స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఇలాంటి ఇంటిమేట్ సీన్లకు సై అంటున్నారు. కథ డిమాండ్ చేస్తే..‘ఎలాంటి’ సీన్ అయినా చేయడానికి రెడీ అంటూ హీరోయిన్లు సైతం ముందుకొస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో ఇంటిమేట్ విప్లవం నడుస్తోన్న ఇలాంటి రోజుల్లో ఓ హీరో మాత్రం తను ముద్దు, రొమాన్స్ సన్నివేశల్లో నటించబోనని తెగేసి చెబుతున్నాడు.
దర్శక నిర్మాతలు ఎంత ఒత్తిడి తెచ్చినా.. తాను మాత్రం అలాంటి సీన్లు అంగీకరించబోనని అంటున్నాడు. ఆ యంగ్ హీరో పేరే ఉన్ని ముకుందన్(Unni Mukundan). మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల కూడా ఉన్ని ముకుందన్ పరిచయమే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడి’, ‘యశోద’ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు. ఇటీవల ఆయన నటించిన మార్కో చిత్రం మలయాళంతో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ అయింది. ఇక తాజాగా 'గెట్ సెట్ బేబీ' అనే మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఇంటిమేట్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ముద్దు, రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండాలని కండీషన్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూర్చొని నా సినిమా చూడాలనుకుంటాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ముద్దు, ఇంటిమేట్ సీన్లలో నటించమని చాలా మంది దర్శకనిర్మాతలు నాపై ఒత్తిడి తెచ్చారు. ఇతర హీరోల సినిమాలను ఉదాహరణగా చూసిస్తూ..మీరు కూడా చెయ్యొచ్చు కదా అని అడిగారు.కానీ సున్నితంగా తిరస్కరించాను. ఒక జంట మధ్య రొమాన్స్ చూపించాలనుకుంటే.. ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదనేది నా భావన. నా తోటి హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని నేను ఏమాత్రం తప్పుపట్టను. నేను అలాంటి వాటిల్లో నటించను. ఇది నాకు నేనుగా పెట్టుకున్నా పాలసీ’ అని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చాడు.