లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే ఏకంగా ఐదు సినిమాలు! | February Lovers Day Release Movies List; Check Here | Sakshi
Sakshi News home page

Lovers Day Release Movies: లవర్స్‌ డే స్పెషల్.. ఆ ఒక్క రోజే ఐదు చిత్రాలు రిలీజ్!

Published Fri, Jan 17 2025 5:12 PM | Last Updated on Fri, Jan 17 2025 5:24 PM

February Lovers Day Release Movies List; Check Here

'ఫిబ్రవరి అంటే వెంటనే... సినిమా లవర్స్‌కు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ అయ్యే సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రేమ నేపథ్యంలో వచ్చే చిత్రాలను విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తే, ప్రేక్షకులు కూడా లవ్‌ మూవీస్‌ని ఆశిస్తారు. దానికి తగ్గట్టే  ఫిబ్రవరిలో అరడజను ప్రేమకథా చిత్రాలు థియేటర్స్‌లోకి  రానున్నాయి. వీటితో పాటు యాక్షన్, ఎమోషనల్‌  మూవీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి మరింత పెరగనుంది. '

రాజుగాడి లవ్‌స్టోరీ..

‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి జోడీగా నటించిన సినిమా ‘తండేల్‌’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... ఉత్తరాంధ్ర మత్స్యకారులు జీవనో΄ాధి కోసం గుజరాత్‌కు వెళ్తారు. అక్కడి సముద్ర తీరంలో తెలియక ఇండియన్‌ బోర్డర్‌ దాటి, పాకిస్తాన్‌ కోస్టు గార్డులకు బంధీలుగా చిక్కుతారు. వీరందరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ‘తండేల్‌’ సినిమా కథ అని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమాలోని రాజు పాత్ర కోసం నాగచైతన్య, ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు.

సాయిరామ్‌ శంకర్‌ 'ఒక పథకం ప్రకారం'..

ఇక ‘ఒక పథకం ప్రకారం’ అంటూ ఇదే రోజు థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు హీరో సాయిరామ్‌ శంకర్‌.   ‘143, బంపర్‌ ఆఫర్‌’ వంటి సినిమాల్లో     నటించిన సాయిరామ్‌ శంకర్‌ నటించిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఒక పథకం ప్రకారం’. క్రైమ్‌ మిస్టరీగా రానున్న ఈ మూవీలో సాయిరామ్‌ శంకర్‌ అడ్వొకేట్ పాత్రలో, సముద్ర ఖని పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. గార్లపాటి రమేష్‌తో కలిసి ఈ చిత్రదర్శక–నిర్మాత వినోద్‌ కుమార్‌ విజయన్‌ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానుంది. శ్రుతీ సోధి, ఆషిమా నర్వాల్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాహుల్‌ రాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ ఆర్‌ఆర్‌ అందించారు. ఇక ఈ సినిమాల కంటే ముందు అప్సరా రాణి, విజయ్‌ శంకర్, వరుణ్‌ సందేశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘రాచరికం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శక–ద్వయం సురేష్‌ లంకపల్లి, ఈశ్వర్‌ వాసె దర్శకత్వంలో ఈ మూవీని ఈశ్వర్‌ నిర్మించగా, ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. 

ఇటు ప్రేమ... అటు సంఘర్షణ

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ మూవీ ‘లైలా’  ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో మోడల్‌ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న రోల్స్‌లో నటిస్తున్నారు విశ్వక్‌ సేన్‌. రామ్‌ నారాయణ్‌ డైరెక్షన్‌లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం దిల్ ‍రూబా..

మరోవైపు ఇటీవలే   ‘క’తో ఓ మంచి హిట్‌ అందుకున్న కిరణ్‌ అబ్బవరం లవర్స్‌ డే రోజున ‘దిల్‌ రూబా’ అనే లవ్‌ అండ్‌ యాక్షన్‌ మూవీతో థియేటర్స్‌లోకి వస్తున్నారు. విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్‌ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా, నాజియా డేవిసన్‌ మరో కీలక ΄ాత్రలో నటించిన ఈ మూవీకి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన ఓ అబ్బాయి, మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లుగా తెలిసింది.

 ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ 

ఈ రెండు సిటీ లవ్‌స్టోరీ మూవీస్‌తో పాటు ఓ గ్రామీణ లవ్‌స్టోరీ కూడా ఇదే రోజున థియేటర్స్‌లోకి రానుంది. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలు తీసిన దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి, మరో నిర్మాత రాహుల్‌ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ అనే తెలంగాణ గ్రామీణ ప్రేమకథ తీశారు. ఖమ్మం– వరంగల్‌ల సరిహద్దు నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో సాయిలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ గ్లింప్స్‌ వీడియోలో ఈ మూవీని ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.  

తాతా మనవడు... తండ్రీకొడుకు

ఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవ్‌స్టోరీ మూవీస్‌ మాత్రమే కాదు.. ఎమోషనల్‌ చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. ప్రముఖ సీనియర్‌ నటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, ‘వెన్నెల’ కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ ‘బ్రహ్మా ఆనందం’ మూవీలో మాత్రం తాతా మనవళ్లుగా నటించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్, సంపత్, రాజీవ్‌ కనకాల ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వంలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కానీ గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయనున్నట్లుగా వెల్లడించారు.

ధన్‌రాజ్ 'రామం రాఘవం'

నటుడు ధన్‌రాజ్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ మూవీ కూడా ఫిబ్రవరి 14నే రిలీజ్‌ కానుంది. తండ్రి పాత్రలో సముద్రఖని, తనయుడి పాత్రలో ధన్‌రాజ్‌ కనిపిస్తారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీని గత ఏడాదే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకునే తండ్రి, తనను తన తండ్రి సరిగా అర్థం చేసుకోవడం లేదనుకునే ఓ కొడుకు మధ్య సాగే భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో ఈ ‘రామం రాఘవం’ మూవీ రానుంది.

సందీప్ కిషన్ మజాకా..

గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరి పేరు భైరవకోన’ అనే ఓ హారర్‌ మూవీతో మంచి హిట్‌ అందుకున్నారు సందీప్‌ కిషన్‌. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మజాకా’ మూవీతో  సందీప్‌ కిషన్‌ వస్తున్నారు. సందీప్‌ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేశ్, ‘మన్మధుడు’ ఫేమ్‌ నటి అన్షు ప్రధాన ΄ాత్రల్లో నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘మజాకా’. ‘నేను లోకల్, ధమాకా’ చిత్రాల ఫేమ్‌ నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్‌ కిషన్, రావు రమేశ్‌ తండ్రీ కొడుకులుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ పతాకాలపై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

శివరాత్రికి నితిన్..

శివరాత్రికి ‘తమ్ముడు’గా  థియేటర్స్‌లోకి రానున్నారు నితిన్‌. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా  ‘తమ్ముడు’ అనే మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించారు.

ఇక సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘జటాధర’. శాస్త్రీయ, పౌరాణిక అంశాలతో ఈ మూవీకి వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రేరణా అరోరా, సివిన్‌ నారం, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ఫస్ట్‌ లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. ఆ సమయంలో ‘జటాధర’ మూవీని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు, జటాధర’ రిలీజ్‌ డేట్స్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.

అలాగే ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో ఆది పినిశెట్టి ‘శబ్దం’ చేయనున్నారు. ‘ఈరమ్‌’ (తెలుగులో ‘వైశాలి’) తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా మూవీ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్‌ కింగ్ల్స్, ఎం.ఎస్‌. భాస్కర్‌ ఇతర కీలక ΄ాత్రల్లో ఈ మూవీని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఫిబ్రవరి నెల ఆరంభానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో రిలీజ్‌ అయ్యేందుకు మరికొన్ని సినిమాలు బరిలోకి రావొచ్చు లేదా ఆల్రెడీ ఫిబ్రవరి రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల్లో విడుదల వాయిదా పడే అవకావం లేకపోలేదు. మరి... ఫిబ్రవరిలో ఫైనల్‌ రిలీజ్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్న సినిమాలేవో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. 

అనువాదాలు రెడీ..

అజిత్‌ హీరోగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘విదాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్‌ నటించారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ్ర΄÷డక్షన్స్‌ నిర్మించిన ఈ యాక్షన్‌ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్‌ కానుంది.

ఇక అనిఖా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్‌ మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ రొమాంటిక్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ   ‘నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం’. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేయాలని, ఫిబ్రవరిలోనే రిలీజ్‌ ఉండొచ్చనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

2022లో విడుదలైన ‘లవ్‌ టుడే’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ తెలుగు ప్రేక్షకులకు నటుడిగా దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరోగా నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్‌’ ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది. తమిళంలో లవర్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా, కేఎస్‌ రవికుమార్, మిస్కిన్, వి.జె. సిద్ధు, హర్షద్‌ ఖాన్‌లు ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. తెలుగులోనూ ఈ మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ముసిమి శివాంజనేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement