‘‘జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు. నా లైఫ్‌లో సినిమా ప్రమోషన్స్ అయినా, మరేదైనా నేను పెద్దగా ప్లాన్ చేసి చేయను. అలా ప్లాన్ చేసి చేస్తే అది యాక్టింగ్ అవుతుంది. అలాంటి నటన నాకు రాదు. వాస్తవానికి దగ్గరగా, సహజంగా ఓ ఫ్లోలో నా ధోరణిలో ముందుకు వెళ్తుంటాను’’ అన్నారు హీరో వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో వెంకటేశ్ చెప్పిన సంగతులు.
⇒ నా కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ పండక్కి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాలో చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంది. అయినా ఇది మంచి వినోదాత్మక చిత్రం. క్లైమాక్స్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, యూత్... ఇలా అందరూ ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. సినిమాలోని కొన్ని సీన్స్‌లో సంక్రాంతి పండగ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టడం జరిగింది
⇒ నాది, దర్శకుడు అనిల్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. మాజీ పోలీసాఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... మధ్యలో ఓ క్రైమ్‌స్టోరీ... ఇలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా లైన్ తను చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. మినిమమ్ గ్యారెంటీ సినిమా అని తెలిసిపోయింది. సినిమాలో కామెడీ రొటీన్‌గా ఉండదు. కొత్త కామెడీ స్టయిల్ ట్రై చేశాం. ఆడియన్స్‌కు నచ్చుతుందనే అనుకుంటున్నాం. అలాగే అనిల్‌తో నాకు మంచి ర్యాపో కుదిరింది. తనతో మూవీస్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోయిన్స్ ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి బాగా నటించారు. ఇద్దరి క్యారెక్టర్స్ క్రేజీగా ఉంటాయి.
⇒ నాన్నగారు (నిర్మాత డి. రామానాయుడు) స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, సినిమా ప్రొడక్షన్ వంటి అంశాలను చర్చిస్తున్నప్పుడు నేను పాల్గొనేవాడిని. అయితే నేను అప్పటికి సినిమాల్లోకి రాలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఇప్పటి ప్రముఖ సంగీత దర్శకులతో మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాను. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ విన్నప్పుడు ఈ సాంగ్ నేనే పాడాలనుకున్నాను... పాడాను. సాంగ్స్‌లో ఎక్కువగా ఇంగ్లిష్ పదాలే ఉన్నాయి కాబట్టి నాకు సులభంగా అయిపోయింది. అయితే మిగతా పాటలకు కూడా మంచి స్పందన వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. అలాగే కొంత గ్యాప్ తర్వాత రమణ గోగులగారు మా సినిమాలో పాట పాడటం హ్యాపీగా అనిపించింది. ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటలు బ్లాక్‌బస్టర్ కావడం అనేది ఆడియన్స్ గొప్పతనం.
⇒ ‘సీతమ్మ వాకిట్లో..’ చిత్రం నుంచి ‘దిల్’ రాజుగారితో నా జర్నీ కొనసాగుతోంది. వారి బ్యానర్‌లో నేను చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఆయనకు మరిన్ని విజయాలు రావాలి. నా తర్వాతి సినిమా కోసం సురేష్‌ప్రొడక్షన్, సితార, మైత్రీ, వైజయంతి మూవీస్ సంస్థల్లో కథల పై వర్క్ జరుగుతోంది.
ఇక ‘రానా నాయుడు 2’ సిరీస్ మార్చిలో స్ట్రీమింగ్ కావొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment