డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ములుగు: యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని హోంగార్డ్స్, ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా సూచించారు. ఈ మేరకు వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జిల్లా ప్రజలకు సైబ ర్ క్రైం నేరాలపై అవగాహన కల్పించాలని, గ్రామీణ యువత నిషేధిత మావోయిస్టు భావజాలానికిలోను కాకుండా సాధ్యమైనంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో జిల్లా కావడంతో వావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన షీ టీం పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా పోలీస్ స్టేషన్‌లవారీగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ట్రాఫిక్, మత్తుపదార్థాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జాకారంలోని డీటీసీ సెంటర్, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని డాగ్‌స్క్వాడ్, డీపీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. అంతకుముందు ములుగు జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాకు ఎస్పీ శబరీష్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ గీతే మహేష్ బాబాసాహేబ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, ఏటూరునాగానం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ నలువాల రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
మావోయిస్టు కార్యకలాపాలపై
ప్రత్యేక నిఘా పెట్టాలి
అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా
Comments
Please login to add a commentAdd a comment