బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన

Published Wed, May 8 2024 3:40 AM

బాధిత

ఆస్పత్రి ఎదుట బందోబస్తు చేపట్టిన పోలీసులు

ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత

కల్వకుర్తి టౌన్‌: ఎమ్మెల్యే కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం పాలైన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా వారి బంధువులు పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఆస్పత్రి వద్ద జనం భారీగా గుమ్మిగూడటంతో పోలీసులు భద్రత పెంచారు. నరేష్‌(28) సోమవారం రాత్రి మృతిచెందటంతో అప్పటికే కల్వకుర్తిలోని సీహెచ్‌సీ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పరశురాములు(35) సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతిచెందగా.. అతడి మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఇద్దరి మృతదేహాలను ఒక దగ్గరికి తీసుకొస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పరశురాములు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నరేష్‌ మృతదేహాన్ని సాధారణంగా మార్చురీలో ఉంచారని, ఫ్రీజర్‌ లేకపోవటంతో దుర్వాసన వచ్చిందని బంధువులు, కుటుంబ సభ్యులు కొద్దిసేపు ఆందోళన చెప్పారు. వెంటనే కల్వకుర్తి సీఐ నాగార్జున కలుగజేసుకొని వెంటనే ఫ్రీజర్‌ను తెప్పించి, మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టించారు. రెండు కుటుంబాలకు చెందిన మృతుల బంధువులు అందరూ ఒక్కసారిగా మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని సంబంధిత కాంగ్రెస్‌ నాయకులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో వారు ధర్నా విరమించారు.

ఆదుకుంటాం..

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే గాక వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నాయకులు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగతంగా నరేష్‌ కుటుంబానికి రూ.20 లక్షలు, పరశురాములు కుటుంబానికి రూ.30 లక్షలు సాయంగా అందిస్తామని తెలియజేయటంతో పాటుగా, వెంటనే వారి కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా వాటిని కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ ఆనంద్‌కుమార్‌ ద్వారా వాటిని అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ సాయంతో పాటుగా, వారికి భవిష్యత్‌లో అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.మల్లురవి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీఇచ్చారు. ఆయన వెంట కల్వకుర్తి అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ఇందిరాశోభన్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలి

కల్వకుర్తి టౌన్‌: రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డా.ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నరేష్‌(28) కుటుంబాన్ని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గోలిశ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ కనీసం వేగాన్ని పాటించాలని తెలియకుండా ఇలాంటి ప్రమాదాలకు కారణమైతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వాహనాన్ని నడిపిన డ్రైవర్‌తో పాటుగా అందులో ప్రయాణించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులకు రూ.కోటి తక్షణ సాయంగా అందించటంతో పాటుగా, వారి కుటుంబాలకు ఎప్పటికీ అండగా ఉంటామని హామీ ఇవ్వాలన్నారు. ఆయన వెంట కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, కడ్తాల జెడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
1/1

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన

Advertisement
 
Advertisement
 
Advertisement