లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు
నాగర్‌కర్నూల్: కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి వరి ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవసహాయంతో కలిసి పాల్గొన్న కలెక్టర్ బదావత్ సంతోష్ వివరిస్తూ జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేశామని, తేమ శాతం పరిశీలించి వచ్చిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు తరలించడంతోపాటు రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లోనే డబ్బులు, బోనస్ జమ అయ్యేలా చూస్తున్నామని వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రంలోని రైతులకు రసీదులు అందజేయాలని, జిల్లాలో ప్రతి రైతు నుంచి పూర్తిస్థాయిలో సన్నరకం వడ్లను సేకరించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేకాధికారులకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాలని, ప్రభుత్వం సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయిలో లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా చూడాలన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటనే జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం వడ్లను గుర్తించి సన్న రకం ధాన్యాన్ని ప్రత్యేకంగా మిల్లులకు తరలించి, రైతులకు రూ.500 బోనస్ వెంటనే అందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించి కొనుగోలు ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment