సమగ్ర విచారణ చేస్తున్నాం
మధ్యాహ్న భోజనం కలుషితం కాలేదు
● గతంలో ఫుడ్ పాయిజన్‌కు నాసిరకమైన గుడ్లు కారణం
● రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి
● కలెక్టర్, ఎస్పీతో కలిసి పాఠశాల సందర్శన.. నీటి నమూనాల సేకరణ
నారాయణపేట/మక్తల్/మాగనూర్/క్రిష్ణ: మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అస్వసతకు గురైన ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరుపుతున్నామని రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు బుధవారం ఆయన మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్‌గౌతమ్‌తో కలిసి పాఠశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పాఠశాలలో అన్నింటినీ పరిశీలించడం జరిగిందని, నీటి నమూనాలు సేకరించి పరీక్షించడం జరిగిందని తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఫుడ్ కమిటీనీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇకపై పాఠశాలలో రోజువారి పరిశీలన చేయనున్నట్లు వివరించారు. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఉపాధ్యాయులు, కొందరు విలేకర్లతోపాటు 400 మంది విద్యార్థులు చేశారని, వారిలో 20 మంది దాకా అస్వస్థతకి గురైనట్లు తెలిసిందని చెప్పారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, కొందరు బుధవారం పాఠశాలకు వచ్చారని పేర్కొన్నారు. ఈ కలుషిత ఆహారం ఘటన తాలూకు విచారణ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఒకే ఘటన మూడు సార్లు జరగడంతో విద్యార్థులలో మనో స్థైర్యం తగ్గిందని, అందుకే తాను, కలెక్టర్, ఎస్పీ వారితో మాట్లాడి, కలిసి తిని,వారికి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment