జాతీయ రహదారి దిగ్బంధం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారి దిగ్బంధం

Published Tue, Jan 28 2025 1:06 AM | Last Updated on Tue, Jan 28 2025 1:06 AM

జాతీయ

జాతీయ రహదారి దిగ్బంధం

కల్వకుర్తి రూరల్‌: వేరుశనగ రైతుల ఆందోళనలు ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా వేరుశనగకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మార్కెట్‌కు సెలవు కావడంతో సోమవారం 332 మంది రైతులు 369 కుప్పలు వేరుశనగ మార్కెట్లో పోశారు. టెండర్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే 180 కుప్పలకు మాత్రమే రేటు పడిందని, మిగతా వాటికి రేటు వేయలేదని, వ్యాపారులు వెనకంజ వేశారని రైతులు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు మార్కెట్‌ ఆవరణలోనే రైతులు ఆందోళన చేపట్టగా.. మార్కెట్‌ సిబ్బంది చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, నచ్చజెప్పినా రైతులు వినలేదు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని, వేరుశనగకు గిట్టుబాటు ధర వచ్చే వరకు తగ్గేది లేదని నినాదాలు చేస్తూ.. రోడ్డుపైకి చేరుకున్నారు.

గంటపాటు రాస్తారోకో

జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై హైదరాబాద్‌ చౌరస్తాలో వేరుశనగ రైతులు రాస్తారోకోకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు నాలుగు వైపులా బైఠాయించి.. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. గంటపాటు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన తీవ్రం కావడంతో కల్వకుర్తి, వెల్దండ సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికి చేరుకుని పర్యవేక్షించారు. సీఐలు రైతులకు నచ్చజెప్పి.. మార్కెట్‌కు తీసుకువచ్చారు. అక్కడ వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు కేవీఎన్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ భర్త సంజీవ్‌యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పండితరావు, మార్కెట్‌ డైరెక్టర్లు రైతులతో మాట్లాడారు. రైతుల కుప్పల వద్దకు వెళ్లి వేరుశనగను రాత్రి 7 గంటల వరకు పరిశీలించారు.

రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూస్తామని వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు కేవీఎన్‌ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. వేరుశనగ పంట ఆయిల్‌ శాతం తక్కువగా ఉండటంతోపాటు ఎగుమతులు లేకపోవడం వల్లే ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు తీసుకొచ్చిన 369 కుప్పలలో 29 కుప్పలకు ఇంకా వ్యాపారులు టెండర్‌ వేయలేదని మార్కెట్‌ సిబ్బంది చెప్పారు.

రైతులకు నష్టం రానివ్వం

పెట్టుబడి వస్తలేదు..

ఈ సంవత్సరం 7 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. వేరుశనగ విత్తనాలకే రూ.70 వేలు ఖర్చు అయ్యాయి. పంట రక్షించుకునేందుకు రసాయనిక మందులు, కూలీ తదితర వాటికి మొత్తం కలిపి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టిన. ప్రస్తుతం వేరుశనగకు డిమాండ్‌ లేకపోవడంతో పెట్టిన పెట్టుబడికి తక్కువగానే డబ్బులు వస్తున్నాయి. నా మూడు నెలల కష్టం వృథా అయ్యింది.

– శ్రీనునాయక్‌, చౌదర్‌పల్లి, వెల్దండ

నాలుగెకరాలు

కౌలుకు తీసుకున్న..

వేరుశనగ దిగుబడి బాగా వచ్చి రేటు అధికంగా వస్తుందని నమ్ముకుని నాకు ఉన్న పొలంతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్న. పంటకు తెగుళ్లు రావడంతోపాటు అధిక వర్షం కురవడంతో దిగుబడి తగ్గింది. అరకొరగా వచ్చిన పంటకు మద్దతు ధర కూడా రాకపోవడంతో.. పెట్టుబడి సంగతి పక్కన పెడితే కౌలు డబ్బులు చేతి నుంచి కట్టాల్సి వస్తుంది.

– జంగమ్మ, బండోనిపల్లి, వెల్దండ

No comments yet. Be the first to comment!
Add a comment
జాతీయ రహదారి దిగ్బంధం 1
1/2

జాతీయ రహదారి దిగ్బంధం

జాతీయ రహదారి దిగ్బంధం 2
2/2

జాతీయ రహదారి దిగ్బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement