సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీని సిద్ధం చేసేందుకు బీఆర్‌ఎస్ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తమ సర్వేల్లో వీక్‌గా ఉన్న స్థానాల్లో ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఇప్పటికే పలుమార్లు దిశా నిర్దేశం చేశారు. అసంతృప్తులు బయటకు వస్తున్న తరుణంలో ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏయే నియోజక వర్గాల్లో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు.. ఎవరు టికెట్ ఆశిస్తున్నారనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, మునుగోడు, నకిరేకల్, కోదాడ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, నేతల మధ్య కొరవడిన సఖ్యతను ఏవిధంగా సరిచేయాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో చర్చించినట్లు సమాచారం. మందుల సామేలు పార్టీని వీడిన నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై ఇతర నియోజక వర్గాల్లోనూ పరిస్థితిపై అరాతీసినట్లు తెలిసింది.
ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం
ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్‌ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్నా..
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని అధినేత కేసీఆర్ పలుమార్లు ప్రకటించినా, ఆయన చేయిస్తున్న సర్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి. ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా.. ఉంటే ఏ మేరకు ఉంది.. అభ్యర్థిని మార్చితే పార్టీ గెలిచే పరిస్థితి ఉంటుందా.. తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుత సర్వేల ప్రకారం వీక్‌గా ఉన్నట్లు భావిస్తున్న మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, కోదాడ నియోజ వర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అక్కడున్న నేతల మధ్య వర్గాలు, అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో బలంగా ఎవరున్నారు? పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విబేధాలు, ఇబ్బందికర పరిస్థితులను ఎలా సరిచేయవచ్చని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
నాలుగు స్థానాల్లో నాలుగు రకాలుగానే..
► నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాల మధ్య సఖ్యత కనిపించడం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి సమస్యను ఏవిధంగా పరిష్కరించాలి, ఎలా సమన్వయం చేయాలన్న దానిపైన పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఒకవేళ అభ్యర్థిని మార్చితే తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు తమ ప్రయత్నాలో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి,
►నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి సిట్టింగులకే టికెట్ ఇస్తామనడంతో ఒక దశలో వీరేశం పార్టీని వీడతారన్న చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయనతో మంతనాలు జరిపారు. దీంతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్ పెద్దలు వేచి చూడాలని చెప్పినట్లు తెలిసింది.
► కోదాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు పోటీగా కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీ అక్కడ ఎ వరికి ఏవిధంగా సర్దిచెప్పాలనే ఆలోచన చేస్తోంది.
► ఇక మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వరన్న చర్చ సాగుతోంది. ఉప ఎన్నికల్లో అధిష్టానం అందరిని ఒకటి చేసి పార్టీ గెలిపించుకుంది. సాధారణ ఎన్నికలు అందుకు భిన్నమైనవి కావడంతో అభ్యర్థి మార్పు తప్పదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం రంగంలోకి దిగనుంది.
► ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ పార్టీని చక్కదిద్దేందుకు గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నారో.. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందో తెలుసుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎలా అనుకూలంగా మార్చుకోవాలో పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య కొరవడిన సఖ్యతపై ఆరా తీస్తున్నారు.
త్వరలో ముఖ్యమంత్రి రాక
నల్లగొండ పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు త్వరలో కేసీఆర్ వస్తారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నల్లగొండను సీఎం దత్తత తీసుకొని అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అవి ఇప్పుడు పూర్తి కావచ్చాయి. వాటిని ప్రారంభించడంతో పాటు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పేందుకు నల్లగొండలో కేసీఆర్ సభ పెట్టాలని పార్టీ యోచిస్తోంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని ప్రారంభించేందుకు సీఎం సూర్యాపేటకు వస్తారని పార్టీ వర్గాలు చెబతున్నాయి. ముఖ్యమంత్రి సభతో జిల్లాలో ఎన్నికల ప్రచారానికి తెరలేపాలని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పర్యటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment