సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట : మంత్రి జగదీష్‌రెడ్డి స్వగ్రామం నాగారం. ఆయన రాజకీయ ప్రస్థానం 2001 నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్‌తో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి పొలిట్ బ్యూరో మెంబర్‌గా కొనసాగారు.
♦ 2001: టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) పార్టీ సూర్యాపేట నియోజికవర్గ ఇన్‌చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికలు ఇన్‌చార్జిగా పనిచేశారు.
♦ 2002 : మహబూబ్‌నగర్ పాదయాత్ర ఇన్‌చార్జి, జలసాధన (బ్రిగేడియర్) 45 రోజుల పాదయాత్ర ఆలంపూర్ నుంచి ఆర్‌డీఎస్)
♦ 2003 : మెదక్ ఉప ఎన్నికలు ఇన్‌చార్జి
♦ 2004 : సిద్దిపేట ఉప ఎన్నికలు ఇన్‌చార్జి ( హరీష్ రావు ఎన్నిక)
♦ 2005:సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి
♦ 2006 : కరీంనగర్ ఉప ఎన్నికల ఇన్‌చార్జి
♦ 2008 : ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికల ఇన్‌చార్జితో పాటు మెదక్ జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
♦ 2009: హుజూర్‌నగర్ ఎన్నికలు (ఎమ్మెల్యేగా పోటీ)
♦ 2009 : సూర్యాపేట నియోజికవర్గ ఇన్‌చార్జి
♦ 2010 : కాగజ్ నగర్ (ఆదిలాబాద్) బెజ్జూర్ ఇన్‌చార్జి
♦ 2011 : బాన్సువాడ నియోజికవర్గ ఉప ఎన్నికల ఇన్‌చార్జి
♦ 2012 : కొల్లాపూర్ ఉప ఎన్నికలు ఇన్‌చార్జి
పరకాల ఉప ఎన్నికలు ఇన్‌చార్జి
♦ 2013 : నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి
♦ 2014–సూర్యాపేట శాసనసభ్యులుగా స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. విద్యా శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.
♦ 2018–సూర్యాపేట శాసనసభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ: బొల్లం మల్లయ్య యాదవ్ స్వగ్రామం నడిగూడెం మండలం కరివిరాల గ్రామం. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బొల్లం మల్లయ్యయాదవ్ 2005లో కోదాడకు వచ్చి కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు.
♦ 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినా రాక పోవడంతో కోదాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 13,544 ఓట్లను సాధించాడు.
♦ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌తో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి 2012లో తెలుగుదేశంలో చేరిక
♦ 2014లో టీడీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావును కాదనే టీడీపి ఇతనికి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతి ఉత్తమ్ చేతిలో 13,437 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
♦ తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శిగా నియమాకం
♦ 2018 ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయనకు టీఆర్‌ఎస్ టికెట్ లభించింది. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతిపై 756 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
♦ తాజాగా రెండవసారి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందారు.
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ ప్రస్తుత శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి స్వగ్రామం మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి. 2018 సాధారణ ఎన్నికలకు ముందు కెనడాలో వ్యాపారం చేసిన ఆయన తన తండ్రి పేరుతో అంకిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఫౌండేషన్‌తో పాటు సై యూత్ పేరుతో నియోజకవర్గంలోని యువతకు, నిరుద్యోగులుకు ఉద్యోగ అవకాశల కోసం శిక్షణ ఇప్పించారు. 2018 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ ఆతర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అనంతరం ఉత్తమ్ హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానికి 2019లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌కుమార్
తిరుమలగిరి (తుంగతుర్తి) : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ స్వస్థలం నల్లగొండ. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగంలో పని చేస్తూ ఓయూజేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్‌పై గెలుపొందారు. రెండవసారి 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్‌పై విజయం సాధించారు.
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ : ప్రస్తుత బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ స్వగ్రామం దేవరకొండ మండలం శేరిపల్లి. ఆయన రాజకీయ ప్రస్థానం 1997నుంచి ప్రారంభమైంది.అప్పటి నుంచి పలుమార్లు స్వగ్రామానికి సర్పంచ్‌గా, దేవరకొండ ఎమ్మెల్యేగా గెలుపోటములు చవి చూశారు. 20ఏళ్ల పాటు సీపీఐలో పనిచేసి 2016లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
♦ 1997, 2002లో రెండు పర్యాయాలు దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సీపీఐ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
♦ 2009లో ఎమ్మెల్యేగా సీపీఐ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు.
♦ 2014లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందాడు.
♦ 2016లో సీపీఐ పార్టీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
♦ 2018లో బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడవ సారి ఎమ్మెల్యేగా సమీప అభ్యర్ధి బాలునాయక్‌పై భారీ మెజార్టీతో గెలుపొందాడు.
♦ 2022లో ముఖ్యమంత్రి కేసీఆర్ రవీంద్రకుమార్‌ను బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కంచర్ల భూపాల్‌రెడ్డి స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల. భూపాల్‌రెడ్డి చిన్ననాటి నుంచే తండ్రి మల్లారెడ్డి నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న సందర్భంలో తెలుగు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో ఇండిపెంటెండ్‌గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు కంచర్ల భూపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ : నల్లమోతు భాస్కర్‌రావు మార్చి 18, 1953లో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం, ముదిగొండ గ్రామంలో వెంకటరామయ్యలక్ష్మీకాంతమ్మలకు జన్మించాడు.
♦ మొట్టమొదటిసారిగా 1983లో నిడమనూరు మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
♦ 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డిపై గెలుపొందాడు.
♦ 2018లో ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై గెలుపొందాడు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్
హాలియా : నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే నోముల భగత్ స్వగ్రామం నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామం. నోముల భగత్ రాజకీయ ప్రస్థానం 2014 నుంచి ప్రారంభమైంది. తన తండ్రి నోముల నర్సింహయ్య నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సాధారణ ఎన్నికల్లో క్రీయాశీలకంగా ఈయన పని చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య గెలుపొందారు. ఆ తరువాత నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందడంతో 2011లో సాగర్ నియోజకవర్గానికి మరో సారి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిపై గెలుపొందాడు. నాటి నుంచి నేటి వరకు నోముల భగత్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ : ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వగ్రామం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల. ఆయన రాజకీయ ప్రస్థానం 1995 నుంచి ప్రారంభమైంది. స్వగ్రామానికి ఎంపీటీసీగా, నార్కట్‌పల్లి మండల జెడ్పీటీసీగా, నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపోటములు చవి చూశారు. 20ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసి 2018 తరువాత ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
♦ 1995లో బ్రాహ్మణ వెల్లంల ఎంపీటీసీగా టీడీపీ నుంచి గెలిచి క్రీయాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు.
♦ కాంగ్రెస్‌లో చేరి 2001లో నార్కట్‌పల్లి జెడ్పీటీసీ గెలిచారు.
♦ 2009లో నియోజకవర్గ పునర్వివిభజనతో నకిరేకల్ అసెంబ్లీ స్ధానం ఎస్సీ రిజర్వుడు కేటాయించడంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యే పదవికి మొట్టమొదటగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రజలతో ఉద్యమంలో పాల్గొన్నారు.
♦ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వీరేశం చేతిలో ఓటమి పాలయ్యారు.
♦ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేషంపై విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు.
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చౌటుప్పల్ : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లింగంవారిగూడెం ఆయన స్వగ్రామం. ఆయన రాజకీయ ప్రస్థానం 2003 నుంచి ప్రారంభమయ్యింది. అంతకు ముందు విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమాల్లో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమంలో చురుకుగా పని చేశారు. ఆ సమయంలో జరిగిన అనేక ఉప ఎన్నికలకు ఇన్‌చార్జిగా కూడా పని చేశారు.
♦ 2009 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.
♦ 2014లో నాటి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మునుగోడు అసెంబ్లీకి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థిగా ఉన్న స్వతంత్ర అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై విజయం సాధించారు.
♦ 2018లో రెండోసారి టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
♦ 2022లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డిపై ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి స్వగ్రామం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరింది. అదే సంవత్సరంలో యాదగిరిగుట్ట ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికై ంది. 2001 నుంచి 2006 వరకు ఎంపీపీగా, 2006 నుంచి 2011 వరకు వంగపల్లి సర్పంచ్‌గా, 2014లో ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో రెండో సారి విజయం సాఽధించి మరో సారి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
పార్టీలో బాధ్యతలు : 2003లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, 2009 నుంచి 2014వరకు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా, 2010లో ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్వగ్రామం మోటకొండూరు మండలం నాంచారిపేట. బెంగళూరులో వ్యాపార రంగం నుంచి రాజ కీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2009 నుంచి స్వచ్ఛంద సేవా కార్యాక్రమాలు చేస్తూ ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి టికెట్ లభించలేదు. దీంతో 2013నుంచి ఆలేరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఊరూర మంచినీటి కోసం బోర్లు, పైప్‌లైన్లు వేయించారు. అయితే అనూహ్యంగా ఆయనకు 2014లో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు భువనగిరి ఆసెంబ్లీ టికెట్ లభించింది.2018లో రెండవసారి టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాఽధించారు.
అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ ఏడాది చివరిలో జరగననున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ఇలా..
Comments
Please login to add a commentAdd a comment