సాక్షిప్రతినిధి నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లోని అసంతృప్తులకు బీఆర్‌ఎస్ చెక్ పెడుతోంది. పదవులిస్తామని బుజ్జగిస్తూ.. వినని వారిపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే బీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణ మాజీ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్‌ను సస్పెండ్ చేసింది. అంతకుముందే సాగర్‌లో ఎన్నికల క్యాంపెయిన్ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కోటిరెడ్డిని నియమించింది. దీంతో ఆయన వర్గం ఎమ్మెల్యే భగత్‌కు వ్యతిరేకంగా పని చేయకుండా వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. కోదాడలోనూ అసంతృప్త నేతలు అందుబాటులో ఉండాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. దీంతో వారంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. మురోవైపు దేవరకొండ, నాగార్జునసాగర్‌లోనూ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.
చేరికలను ప్రోత్సహిస్తూ..
నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో బీఆర్‌ఎస్ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు తమ మాట వినని వారిపై వేటు వేస్తోంది. నల్లగొండ, నకిరేకల్, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, ఆలేరు వంటి నియోజకవర్గాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యాచరణ వేగవంతం చేసింది. ఇటీవల ఆలేరు నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడు చామల ఉదయ్ చందర్‌రెడ్డిని, హుజూర్‌నగర్ నుంచి ఎన్‌డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లును పార్టీలో చేర్చుకుంది. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను, నల్లగొండ నియోజకవర్గానికి చెందిన చకిలం అనిల్‌కుమార్‌ను కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడారు.
కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, శశిధర్‌రెడ్డి వంటి నేతలను హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని కేటీఆర్ కార్యాలయం నుంచి వర్తమానం అందింది. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అభ్యర్థిత్వాన్ని ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్ వంటి వారు వ్యతిరేకిస్తున్నారు. నాగార్జునసాగర్‌లోనూ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి వంటి నేతలు టికెట్ ఆశించారు. ఇప్పటికీ తమకు టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సినీ నటుడు చిరంజీవి ద్వారా కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారిని కూడా త్వరలోనే పిలిచి బుజ్జగించే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ లోకల్ వార్..
నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్ మన్నెం రంజిత్‌యాదవ్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా లోకల్ వాదాన్ని తెర పైకి తెస్తున్నారు. దీంతో ఇప్పుడు నాగార్జున సాగర్ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు కొనసాగుతోంది.
సీఎం ఆదేశాలతో వెనక్కి తగ్గిన చాడ
తెలంగాణ ఉద్యమ నాయకుడు, పార్టీ రాష్ట కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి ఇన్నాళ్లు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి దూరంగా ఉన్నారు. ఇటీవల కేటీఆర్ పర్యటించిన సమయంలోనూ ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో తమను అవమానపరుస్తున్నారని భావించి చాడ పోటీలో ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం కిషన్‌రెడ్డి ఇంటికి పార్టీ జిల్లా ఎన్నికల క్యాంపెయిన్ ఇన్‌చార్జి బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వెళ్లి మాట్లాడి ఒప్పించారు. పార్టీ నిర్వహించిన ఉద్యమకారుల సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 15వ తేదీన సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు.
వినకపోతే వేటే!
బీఆర్‌ఎస్ అభ్యర్థుల పట్ల అసంతృప్తి రాగం ఆలపిస్తున్న నేతలను అధిష్టానం బుజ్జగించినా మాట వినకపోతే మాత్రం వేటు తప్పదనే సంకేతాలను ఇస్తోంది. ఇందులో భాగంగా సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించిన వట్టె జానయ్యయాదవ్‌ను పార్టీ దూరంగా పెట్టింది. దీంతో ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలోనూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాడే తాను పోటీలో ఉంటానని పేర్కొన్నారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ ఇన్‌చార్జి బండా నరేందర్‌రెడ్డి శనివారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment