నల్లగొండ టూటౌన్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ ఘోరపరాజయం పాలైంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా, పొత్తులో భాగంగా కోదాడ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. కేవలం సూర్యాపేటలో మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను రాబట్టి కాస్త పరువు నిలుపుకుంది. ఇక్కడ పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరావు 40,407 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
ఇక మిగతా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమలం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో కమలం పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. నల్లగొండలో మాదగాని శ్రీనివాస్‌గౌడ్, హుజూర్‌నగర్‌లో చల్లా శ్రీలత, మిర్యాలగూడలో సాధినేని శ్రీనివాసరావు నాలుగో స్థానానికి దిగజారగా, మిగతా వారు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత సాగర్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
మూడు సభల్లో అమిత్‌షా పాల్గొన్నా..
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని అనుకున్న ఆ పార్టీకి 10 చోట్ల డిపాజిట్లు కూడా రాకపోవడంతో బొక్క బోర్లా పడింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం వంటి హామీలు కలిసి వస్తాయనుకున్నా నిరాశే మిగిలింది. నల్లగొండ, సూర్యాపేట, చౌటుప్పల్‌లో కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో బహిరంగ సభలు నిర్వహించారు.
ఈ మూడు చోట్ల కేవలం సూర్యాపేటలో మాత్రమే 40 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. మరో కేంద్ర సహాయమంత్రి శోభాకరంద్లాజే నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడలో పర్యటించి ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థులకు ఆశించిన ఫలితాలు రాలేదు.
జనసేనను ఆదరించని జనం..
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నుంచి కోదాడలో పోటీ చేసిన మేకల సతీష్‌రెడ్డిని జనం ఆదరించలేదు. ఆయన కేవలం 1,696 ఓట్లు మాత్రమే సాధించి 4వ స్థానానికి పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment