ప్రాణం తీసిన పరిహాసం
నాగార్జునసాగర్: ఇద్దరు స్నేహితుల మధ్య పరిహాసం కాస్త చిలికి చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చాయి. నాగార్జునసాగర్ సీఐ బీసన్న తెలిపిన వివరాల ప్రకారం.. నందికొండ మున్సిపాలిటీకి చెందిన నేలటూరి వెంకటేష్, నాగూర్ బాషా స్నేహితులు. మంగళవారం మధ్యహ్నం విజయ విహార్ ఎదుట ఒకరితో ఒకరు పరిహాసం ఆడుకుంటూ మాట్లాడుకుంటుండగా.. వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్త పెద్దగా మారింది. సాయంత్రం వారిద్దరు నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ మందా రఘువీర్కుమార్(బిన్ని) దగ్గరకు వెళ్లి గొడవ పడ్డారు. ఆయన వారిని సత్యనారాయణస్వామి గుడి ముందు గల బొల్లెపల్లి శ్రీనివాసరాజు క్వార్టర్స్ దగ్గరకు పిలిచి మాట్లాడాడు. అప్పటికే వెంకటేష్ మద్యం సేవించి ఉన్నాడు. దీంతో పండుగ పూట పంచాయితీ ఎందుకు ఎవరి ఇంటికి వారు వెళ్లిపొండని రఘువీర్కుమార్ వారిద్దరికి చెప్పి పంపించాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో నాగూర్ బాషా ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్ నాగూర్ బాషాను అడ్డుకుని అతడి పొట్టలో పొడిచాడు. నాగూర్ బాషాకు రక్తస్త్రావం అవుతుండగా స్థానికులు కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు నాగూర్ బాషా డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నెట్‌బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో పాల్గొన్నాడు.
న్యాయం చేయాలంటూ ధర్నా
తమ కుమారుడిని హత్య చేసిన వ్యక్తిని శిక్షించి న్యాయం చేయాలంటూ బుధవారం రాత్రి సత్యనారాయణస్వామి గుడి వద్ద, పోలీస్ స్టేషన్ ఎదుట నాగూర్ బాషా కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
● మద్యం మత్తులో స్నేహితుడిని
కత్తితో పొడిచి చంపిన నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment