కర్నూలు(అగ్రికల్చర్): టమాట ధరకు రెక్కలు వస్తున్నాయి. రబీలో టమాట సాగు తగ్గిపోవడం, వచ్చిన టమాట దిగుబడులు ఇతర ప్రాంతాలకు తరలుతుండటంతో మార్కెట్‌లో కొరత ఏర్పడుతోంది. దీంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు రైతు బజారులో కిలో ధర రూ.30 ఉండగా... బయట కిలో రూ.50 ఆపైన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ధర మరింత ఎక్కువగా ఉంది. రబీలో టమాట సాధారణ సాగు 511 హెక్టార్లు ఉండగా.. కేవలం 136 హెక్టార్లలో సాగు అయింది. టమాటతో సహా కూరగాయల సాగుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో సాగు తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఆదివారం పత్తికొండ మా ర్కెట్‌కు కేవలం 37 టన్నుల టమాట మాత్రమే వచ్చింది. ఒక దశలో ఈ మార్కెట్‌కు 80 టన్నులకు పైగా వచ్చింది. సగానికి పైగా తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడుతోంది. క్వింటాలుకు కనిష్ట ధర రూ.2000, గరిష్ట ధర రూ.3200 లభించింది.సగటు ధర రూ.2500 నమోదు అయింది. రానున్న రోజుల్లో టమాట ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment