ఫీజు కోసం విద్యార్థులను ఒత్తిడి చేస్తే చర్యలు
నంద్యాల: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో చదివే విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు ఫీజు చెల్లించలేదనే కారణంతో హాల్ టికెట్లు జారీ చేయకపోయినా, ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. జ్ఞానభూమి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. హాల్ టికెట్టు ఇవ్వకపోయినా, ధ్రువపత్రాలు జారీ చేయకపోయినా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కో–ఆర్డినేషన్ సెంటర్ ఫోన్ 08514–293903, 08514–293908 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
శ్రీశైల జలాశయం నుంచి నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల జలాశయం ద్వారా శనివారం నుంచి ఆదివారం వరకు దిగువ ప్రాజెక్టులకు 44,192 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జలాశయానికి సుంకేసుల నుంచి 3,064 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 14.952 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువ నాగార్జున సాగర్‌కు 32,981 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం సమయానికి సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,368 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 145.1520 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 870.80 అడుగులకు చేరుకుంది.
ప్రాథమిక పాఠశాలలను కాపాడుకుందాం
కోవెలకుంట్ల: ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసికట్టుగా ఉద్యమించి ప్రాథమిక పాఠశాలలను కాపాడుకుందామని యూటీఎఫ్(ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహా సభ నిర్వహించారు. ఆ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12వేల పైచిలుకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం ఆవేదన కల్గించే విషయమన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, విద్యా రంగానికి సంబంధించిన వివిధ యాప్‌ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, 117 జీఓ రద్దు చేయాలన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారానికి పోరాటాలు ఒకటే మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యంశెట్టి, నాయకులు సుధాకర్, ఐజయ్య, నాగస్వామి, సుజాత, సత్యప్రకాశం, శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు.
జీడీపీకి నీటి విడుదల
కర్నూలు సిటీ: హంద్రీనదిపై నిర్మించిన గాజులదిన్నె ప్రాజెక్టు (దామోదం సంజీవయ్య సాగర్)లో నీటి నిల్వలలు తగ్గిపోతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హంద్రీనీవా కాలువ నుంచి ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు నీటి లభ్యత లేక కేవలం తాగు నీటి అవసరాలు తీర్చే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులా మారింది. దీంతో హంద్రీనీవా కాలువ ఏర్పాటైన తర్వాత 11.40 కి.మీ దగ్గర అదనపు స్లూయిజ్ ఏర్పాటు చేసి నీరు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment