శ్రీగిరికి పోటెత్తిన భక్తజనం
శ్రీశైలంటెంపుల్: ఇలకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. కార్తీకమాస నాలుగో ఆదివారాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు వేకువజామున్నే పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తులు కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయం ఎదురు గంగాధర మండపం వద్ద, ఉత్తరమాఢవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.
నేడు లక్షదీపోత్సవం..పుష్కరిణి హారతి
కార్తీక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణికి దశవిధహారతులు ఇస్తారు.
ట్రాఫిక్ జాం
శ్రీశైలానికి భక్తులు వాహనాల్లో భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆదివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తమ సొంత వాహనాల్లో తిరుగు ప్రయాణమైన భక్తులు ఒక్కసారిగా వాహనాలతో రోడ్డుమీదకు రావడంతో రద్దీ పెరిగింది. శ్రీశైలం టోల్‌గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment