ఎయిడ్స్‌పై అవగాహన పెంచండి
నంద్యాల: ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సోమవారం కలెక్టరేట్‌లో జేసీ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం ఉండటంతో ఈనెల 27వ తేదీ నుంచి 15రోజుల పాటు ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రామునాయక్, డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ శారదాబాయి పాల్గొన్నారు.
నాగార్జున సాగర్‌కు నీరు విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల జలాశయం నుంచి దిగువ నాగార్జునసాగర్‌కు ఆదివారం నుంచి సోమవారం వరకు 35,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 15.785 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన అనంతరం నీటిని సాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలానికి సుంకేసుల నుంచి కేవలం 1,132 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. ఇక్కడి నుంచి సాగర్‌తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 7,000 క్యూసెక్కులు,హంద్రీనీవా సుజలస్రవంతికి 1,547 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 140.6495 టిఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 869.80 అడుగులకు చేరుకుంది.
పర్యావరణాన్ని
పరిరక్షించుకుందాం
ఆళ్లగడ్డ: అన్ని జీవరాశులు ఆరోగ్యకర మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమని జిల్లా అటవీ అధికారి కృష్ణమూర్తి అన్నారు. పర్యావరణం దెబ్బతింటే ఆ ప్రభావం ఎక్కువగా వన్యప్రాణులపై పడుతుందని చెప్పారు. సోమవారం అహోబిలం అడవి ప్రాంతాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎగువ అహోబిలంలోని పాతాల గంగ సమీపంలో హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. ప్లాస్టిక్ బ్యాగులను వాడరాదన్నారు. దేశానికి పచ్చని హారంగా ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, వన్యప్రాణుల పరిరక్షణ ప్రతి ఒక పౌరుడి బాధ్యత అన్నారు. అనంతరం ఎర్రచందనం, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీశాఖ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈయన వెంట రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతినాయుడు, డీఆర్వో ముర్తుజావలి ఉన్నారు.
వందశాతం ఫలితాలు సాధించాలి
నంద్యాల (న్యూటౌన్): పదవ తరగతిలో ఈసారి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఖలీల్ సిద్ధిఖీ ఎయిడెడ్ హైస్కూల్‌ను సందర్శించారు. ప్రార్థన కార్యక్రమంలో డీఈఓ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అస్మోద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రేపు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్ష
కర్నూలు (అర్బన్): ఈనెల 27వ తేదీన స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లో ఉదయం 11 గంటలకు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారిణి పి.వెంకటలక్షుమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటల లోపు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ పరీక్ష హాలుకు హాజరుకావాలన్నారు. 10.45 గంటల తర్వాత హాజరైన విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించడం జరగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment